బూస్టర్‌ డోసు, చిన్నారులకు టీకాపై

4 Dec, 2021 05:39 IST|Sakshi

నిపుణుల సలహా పాటిస్తాం

లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా

న్యూఢిల్లీ: కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న తర్వాత బూస్టర్‌ డోసు తప్పనిసరిగా తీసుకోవాలా? 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ ఎప్పటినుంచి ఇస్తారు? అనేదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా స్పందించారు. బూస్టర్‌ డోసు, చిన్నారులకు కరోనా టీకాపై నిపుణుల నుంచి వచ్చే శాస్త్రీయమైన సలహాలు సూచనల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని చెప్పారు. కోవిడ్‌ మహమ్మారిపై శుక్రవారం లోక్‌సభలో సుదీర్ఘంగా సాగిన చర్చలో మాండవియా మాట్లాడారు.

‘ఎట్‌–రిస్క్‌’ దేశాల నుంచి వచ్చిన 16 వేల మంది ప్రయాణికులకు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించామని, 16 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. వీరి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపించామని, వారికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందా లేదా అనేది అతిత్వరలో తేలుతుందని చెప్పారు. కరోనాను నియంత్రించే విషయంలో ప్రభుత్వం సమర్థంగా పని చేస్తోందని, ప్రతిపక్షాలు మాత్రం అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా టీకాలపై ప్రతిపక్షాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని, దీనివల్ల వ్యాక్సినేషన్‌పై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నెలలో అదనంగా 10 కోట్ల డోసులు
ఇప్పటిదాకా 85 శాతం మంది లబ్ధిదారులు టీకా మొదటి డోసు తీసుకున్నారని, 50 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని మన్‌సుఖ్‌ మాండవియా తెలిపారు. రాష్ట్రాల వద్ద ప్రస్తుతం 22 కోట్ల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని, ఈ నెలలోనే అదనంగా 10 కోట్ల డోసులు అందజేస్తామని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు హర్‌ ఘర్‌ దస్తక్‌(ఇంటింటికీ టీకా) కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు