చింతన్‌ శిబిర్‌.. కాంగ్రెస్‌ సంచలన నిర్ణయాలు ఇవే..

16 May, 2022 04:56 IST|Sakshi
సంకల్ప్‌ శిబిర్‌ ముగింపు భేటీలో పార్టీ సీనియర్‌ నేతలతో సోనియా గాంధీ, రాహుల్‌

ప్రభుత్వాల్లోనూ, పార్టీలోనూ సగం 

చింతన్‌ శిబిర్‌లో కాంగ్రెస్‌ నిర్ణయం

ఉదయ్‌పూర్‌ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్‌కు నూతన జవసత్వాలు కల్పించడం, కింది స్థాయి నుంచి బలోపేతం కావడం, ప్రజలకు దగ్గరవడమే లక్ష్యంగా ‘చింతన్‌ శిబిర్‌’ పలు తీర్మానాలు చేసింది. యువ నేతలు వరుసగా పార్టీని వీడుతున్న ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు పార్లమెంటు, అసెంబ్లీ, శాసన మండలి ఎన్నికల్లో సగం టికెట్లు 50 ఏళ్ల లోపు నేతలకే కేటాయించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, పార్టీ పదవుల్లోనూ సగం వారికే కట్టబెడతారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఎన్నికైన పదవులకు పార్టీపరంగా రిటైర్మెంట్‌ వయసును ఖరారు చేస్తారు. వీటన్నింటినీ 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి అమలు చేయాలని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం ముగిసిన మూడు రోజుల కాంగ్రెస్‌ ‘నవ్‌ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌’ నిర్ణయించింది.

పార్టీ ప్రక్షాళన కోసం చేపట్టాల్సిన మార్పుచేర్పులు తదితరాలపై అంశాలవారీగా ఏర్పాటైన రాజకీయ, సామాజిక న్యాయ–సాధికారత, ఆర్థిక, సంస్థాగత వ్యవహారాల, వ్యవసాయ, యువజన ప్యానళ్లు రెండు రోజులుగా చర్చించి పలు ప్రతిపాదనలతో అధినేత్రి సోనియాకు నివేదికలు సమర్పించాయి. ఆదివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కూలంకషంగా చర్చించి వాటికి ఆమోదముద్ర వేసింది. ఒక వ్యక్తికి పార్టీలో ఒకే పదవి, ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ వంటి పలు తీర్మానాలతో ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌ ప్రవేశపెట్టిన ఉదయ్‌పూర్‌ నవ్‌ సంకల్ప్‌ డిక్లరేషన్‌ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆమోదించిన తీర్మానాలు...

నమో యువత...
► 2024 నుంచి లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ, మండలి ఎన్నికల్లో 50 శాతం టికెట్లు 50 ఏళ్ల లోపువారికే. ప్రభుత్వ పదవుల్లోనూ సగం వారికే. చట్టసభల్లో రిటైర్మెంట్‌ వయసు ఖరారు.
► పార్టీలో అన్ని స్థాయిల్లోనూ 50 శాతం పదవులు 50 ఏళ్లలోపు వారికే
► యువతకు ఉద్యోగాల డిమాండ్‌తో ఆగస్టు 15 నుంచి కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ‘ఉపాధి దో’ పాదయత్ర.
సంస్థాగత, సామాజిక అజెండాలు
► ఇకపై పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి, ఒక కుటుంబానికి ఒకే టికెట్‌. కుటుంబంలో రెండో సభ్యుడు రాజకీయంగా చురుగ్గా ఉంటే ఐదేళ్ల సంస్థాగత అనుభవం తర్వాతే టికెట్‌కు అర్హత.
► పార్టీ పదవిలో ఎవరూ ఐదేళ్ల కంటే ఉండొద్దు.
► పబ్లిక్‌ ఇన్‌సైట్, ఎన్నికల నిర్వహణ విభాగాలు, నేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు.
► పార్టీలో అన్ని స్థాయిల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం.
► అధ్యక్షునికి సలహాలు సూచనలు ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ సభ్యలతో అడ్వైజరీ గ్రూప్‌ ఏర్పాటు.
► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల గొంతుక విన్పించేందుకు సామాజిక న్యాయ సలహా మండలి.
► కులాలవారీ జనగణనకు జాతీయ స్థాయి పోరు
► చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలి.
► రైతులకు ఉచిత విద్యుత్తు, గిట్టుబాటు ధరతో పాటు 50 శాతం అదనంగా చెల్లించాలి.
► జాతీయ రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి.
► రైతుల రుణ ఉపశమన కమిషన్‌ తేవాలి.
► పేద విద్యార్థులకు కాలేజీలు, వర్సిటీల్లో ఉచిత విద్య అందించాలి.
► పేదరికం, ఆర్థిక అసమానతలను రూపుమాపే ఆర్థిక విధానాల రూపకల్పనకు కాంగ్రెస్‌ కట్టుబడింది.

సమయానుకూలంగా పొత్తులు
డిక్లరేషన్లో కాంగ్రెస్‌.. బీజేపీపై నిప్పులు
బీజేపీది కుహనా జాతీయవాదమంటూ ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్లో కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. తమదే సిసలైన జాతీయవాదమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాతో రాజ్యాంగంపై మోదీ సర్కారు దాడి చేస్తోంది. మత విభజనను వ్యాప్తి చేస్తోంది. రాష్ట్రాల అధికార పరిధిని ఆక్రమిస్తోంది. గవర్నర్‌ పదవినీ దుర్వినియోగం చేస్తోంది. ప్రమాదకర ఆర్థిక విధానాలకు తెర తీసింది’’ అంటూ దుమ్మెత్తిపోసింది. దేశ ప్రయోజనాల కోసం భావ సారూప్య పార్టీలతో  సమయానుకూల పొత్తులకు కాంగ్రెస్‌ సిద్ధమని ప్రకటించింది.

ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్‌ మాణిక్‌ సాహా

మరిన్ని వార్తలు