కరెంట్‌ బిల్లు కట్టలేదని మెసేజ్‌.. తీరా ఓపెన్‌ చేసి చూస్తే..

3 Jul, 2022 19:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: విద్యుత్‌ బిల్లుల చెల్లింపు పేరిట ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ, ఫోన్‌ కాల్స్‌ చేస్తూ ఓ ముఠా కొత్తరకం మోసానికి పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్‌ వినియోగదారులకు ఇటీవల కాలంలో ఎస్‌ఎంఎస్‌ రూపంలో, ఫోన్‌ కాల్‌ రూపంలో విద్యుత్‌ బిల్లుల చెల్లింపు కోసం సమాచారం వస్తోందని ఇందులో వివరించారు.

వీటిలో గత నెల బిల్లులు అప్‌ డేట్‌ చేయలేదని, గడవు తేదీ ముగిసిన దృష్ట్యా, త్వరితగతిన చెల్లించాలని లేని పక్షంలో విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేస్తామన్న హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాచారంతో విద్యుత్‌ బోర్డు పేరిట లింక్‌లు పంపిస్తున్నారని తెలిపారు. ఆ లింక్‌లు తెరవగానే, వినియోగ దారుల బ్యాంక్‌ ఖాతాల్లో నగదు మాయం అవుతోందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని ఆయన పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపునకు సంబంధించి విద్యుత్‌ బోర్డు ఎలాంటి ఎస్‌ఎంఎస్‌లు పంపించడం లేదని, ఫోన్‌ కాల్‌ చేయడం లేదని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.

చదవండి: ఇంటి ముందు కల్లేపు చల్లే విషయంపై గొడవ.. స్నేహితుడితో కలిసి..

మరిన్ని వార్తలు