మొబైల్‌కు మెసేజ్‌.. క్రిప్టో పేరుతో లూటీ!

20 Oct, 2022 19:49 IST|Sakshi

లక్కీ డ్రా గిఫ్టు పేరుతో ప్రజలు మొబైళ్లకు ఓటీపీ పంపించి వారి బ్యాంకు అకౌంట్లను కాజేసే సైబర్‌ నేరగాళ్లు ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ ఆశ చూపించి దోచేస్తున్నారు. దీనికి ఇన్‌స్టా గ్రాంలో చురుకుగా ఉంటున్న యువతనే టార్గెట్‌ చేసుకున్నారు. మెసేజ్‌లు, లింక్‌లు పంపించి పలు నకిలీ కంపెనీల బ్రోచర్లను చూపి అధిక లాభాల పేరుతో వలలో వేసుకుంటారు. క్రిప్టో కరెన్సీ మోజులో  పడి మోసపోతున్న వారిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులతో పాటు యువత ఎక్కువగా ఉన్నారు.

ఎలా వంచనకు పాల్పడతారంటే  
అంతర్జాతీయ స్థాయిలో క్రిప్టో కరెన్సీ పై తీవ్ర చర్చ జరుగుతోంది. కోవిడ్, ఆ తరువాత కాలంలో ఈ సైబర్‌ డబ్బు విలువ పెరిగింది. దీంతో వంచకులు క్రిప్టో బాట పట్టారు. యువత, టెక్కీలు చాలామంది ఇన్‌స్టా వినియోగిస్తారు. సైబర్‌ మోసగాళ్లు వారికి లింక్‌లు పంపుతూ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే అచిర కాలంలోనే భారీ లాభాలు వస్తాయని చెబుతారు.

పెట్టుబడి పెట్టాక అకౌంట్‌ను, ఫోన్‌ నంబర్లను బ్లాక్‌ చేసేస్తారు. దీంతో బాధితులు మోసాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తారు. సైబర్‌ వంచకులు ఇతరుల ఇన్‌స్టా అకౌంట్లను హ్యాక్‌ చేసి మోసాలకు పాల్పడతారు. వారు పంపించిన లింక్, యుఆర్‌పీఎల్‌ కొద్దిరోజుల్లోనే డీ యాక్టివేట్‌ అవుతాయి. వంచకులు  నగదు జమచేసుకునే బ్యాంకు అకౌంట్లు కూడా నకిలీల పేరుతో ఉంటాయి. దీంతో కేసుల విచారణ కష్టంగా ఉంటుందని పోలీస్‌ అధికారులు తెలిపారు.  

జాగ్రత్తగా ఉండాలి
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టే అధికారిక కంపెనీలు ఏవి, వాటికి అనుమతులు ఉన్నాయా? ఇలా పలు విషయాలను తెలుసుకున్న తరువాతనే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. కానీ సోషల్‌ మీడియాలో వచ్చే లింక్‌లను నమ్మి మదుపు చేస్తే మోసపోతారని సైబర్‌ నిపుణులు తెలిపారు. ఇబ్బడిముబ్బడిగా లాభాలు వచ్చాయని దుండగులు నకిలీ సక్సెస్‌ స్టోరీలను పోస్ట్‌ చేసి మాయకు గురిచేస్తారు. కాబట్టి క్రిప్టో విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆగ్నేయవిభాగ సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌ సీఐ ఆర్‌.సంతోష్‌రామ్‌ తెలిపారు. 

లక్షల రూపాయలు పోయాయి 
నగరంలో పేరుపొందిన ఐటీ కంపెనీ ఉద్యోగి  ఇన్‌ స్టా ఖాతాకు క్రిప్టోలో పెట్టుబడి పెడితే లక్షలాది రూపాయల లాభం పొందవచ్చని ఒక సక్సెస్‌ స్టోరీ వచ్చింది. స్నేహితులు పంపిన లింక్‌ కదా అని నమ్మి దశలవారీగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కొన్ని రోజులు గడిచినప్పటికీ లాభాలు రాకపోగా అకౌంట్‌లో ఉన్న నగదు మాయమైంది. దీనిపై బాదితుడు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

చదవండి: మోసం చేస్తూ ఏడాదికి రూ.312 కోట్లు సంపాదన.. స్వయంగా అంగీకరించిన యూట్యూబర్‌!

మరిన్ని వార్తలు