తౌక్టే ఎఫెక్ట్‌ : 273 మంది ఉన్న నౌక కొట్టుకుపోయింది

17 May, 2021 20:51 IST|Sakshi

ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్‌ అతి తీవ్ర తుఫాన్‌గా మారింది.  ఇప్పటికే ఈ తుఫాన్ ధాటికి మహారాష్ట్ర, క‌ర్ణాట‌క‌, కేర‌ళ , గోవా, గుజ‌రాత్‌, రాష్ట్రాల తీర ప్రాంతాలు విలవిలలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తుఫాను ‍ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  అరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారి అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. బ‌ల‌మైన గాలుల ధాటికి ముంబై ప‌శ్చిమ తీరంలో 'పి 305' అనే వ్యాపార నౌక కొట్టుకుపోయింది. అందులో సుమారు 273 మంది ఉన్న‌ట్లు స‌మాచారం.

సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఎఆర్) వారు పంపించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కొచ్చి గాలింపు చర్యలను ప్రారంభించింది.   ఈ రాత్రికి గుజరాత్‌లోని పోరుబందర్‌- మహువా మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవ‌కాశం ఉన్న‌దని వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

( చదవండి: Cyclone Tauktae: అత్యంత తీవ్ర తుపానుగా తౌక్టే  )

మరిన్ని వార్తలు