Cyclone Tauktae: తౌక్టే ఎఫెక్ట్‌తో 21 జిల్లాల్లో అలర్ట్‌

16 May, 2021 01:00 IST|Sakshi
శనివారం అరేబియా సముద్రం నుంచి బాద్వార్‌ ఒడ్డుకు వస్తున్న మత్స్యకారులు  

నేడు మహారాష్ట్రలోకి ప్రవేశించనున్న తౌక్టే తుపాను  

3 రోజుల పాటు ఈదురుగాలులతో భారీ వర్షాలకు అవకాశం 

5 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్, 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ 

సింధుదుర్గా, రత్నగిరి జిల్లాల్లో ఇప్పటికే మొదలైన వర్షాలు

సాక్షి ముంబై: తౌక్టే తుఫాన్‌ ఆదివారం వేకుమజామున మహారాష్ట్రలోకి ప్రవేశించనుండటంతో 21 జిల్లాల్లో అధికారులు అలర్ట్‌ ప్రకటించారు. 5 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్, మరో 16 జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. ఇక టౌటే తుపాన్‌ ప్రభావంతో మహారాష్ట్రలోని సింధుదుర్గా, రత్నగిరి జిల్లాల్లో ఇప్పటికే ఈదురు గాలులతోపాటు మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. అనేక తీర ప్రాంతాల్లో సముద్ర అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతుండగా మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి.

కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకూలాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ముఖ్యంగా టౌటే తుఫాన్‌ మహారాష్ట్రలోకి ఆదివారం వేకువజామున ప్రవేశించనుందని అంచనా. అయితే సముద్రతీరానికి సుమారు 350 కిలోమీటర్ల దూరం నుంచి ఈ టౌటే తుఫాన్‌ గుజరాత్‌ దిశగా ముందుకుసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌ ముందుకు సాగుతున్న కొద్దీ బలపడుతోంది. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడనుంది. ఇలాంటి నేపథ్యంలో అధికారులు అన్ని విధాలుగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.   

16, 17, 18 తేదీల్లో.. 
ముంబై కొలాబా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో అలర్ట్‌ను జారీ చేశారు. వీటిలో కొంకణ్‌తోపాటు విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలోని జిల్లాలున్నాయి. ఆరెంజ్‌ అలర్ట్‌ జిల్లాలలో సింధుదుర్గా, రత్నగిరి, సాతారా, సాంగ్లీ, కోల్హపూర్‌ ఉన్నాయి. మరోవైపు ఎల్లో అలర్ట్‌ జిల్లాల్లో విదర్భలోని 11 జిల్లాలతోపాటు ముంబై, థానే, పాల్ఘర్, రాయిగడ్, పుణేలున్నాయి. మరోవైపు గతంలో నిసర్గ తుఫాన్‌ మహారాష్ట్ర భూభాగం నుంచి తీరం చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ తుఫాన్‌ మహారాష్ట్ర భూభాగం నుంచి తీరంపై విరుచుకుపడనుందా అనే విషయంపై అక్కడి ప్రాంత ప్రజల్లో కొంత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే అలాంటిదేమి లేదని సముద్ర తీరానికి దూరం నుంచే గుజరాత్‌లో మే 18వ తేదీ తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. మే 16, 17, 18వ తేదీలలో మహారాష్ట్రపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి నేపథ్యంలో కొంకణ్‌లోని సింధుదుర్గా, రత్నగిరి జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయగా రాయిగఢ్, ముంబై, థానే, పాల్ఘర్‌ జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. సింధుదుర్గా జిల్లాల్లోని 38 గ్రామాలకు తుఫాన్‌ ముప్పు ఏర్పడింది. దీంతో అక్కడి అధిక ముప్పు ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించం ప్రారంభించారు. 

సీలింక్‌పై రాకపోకలు బంద్‌ 
టౌటే తుఫాన్‌ ప్రభావం ముంబై, థాణే, పాల్ఘర్‌లతోపాటు రాయిగఢ్‌ జిల్లాలపై ప్రభావం కూడా పడే అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ముంబైలోని వర్లీ సీలింక్‌ వంతెనపై నుంచి రాకపోకలను మూసివేశారు. తుఫాన్‌ ప్రభావంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై మేయర్‌ కిషోరి పెడ్నేకర్‌ తెలిపారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జంబో కోవిడ్‌ సెంటర్లలోని రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.

అదేవిధంగా బీఎంసీలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలపై నిఘా వేయడంతోపాటు సూచనలు, సహాయాన్ని అందించడం జరగనుంది. ముఖ్యంగా ఎన్‌డీఆర్‌ఎఫ్, నేవీతోపాటు పోలీసులు, కోస్టుగార్డు ఇతర బలగాలను తీర ప్రాంతాల్లో మొహరించారు. తీర ప్రాంతాలకు ఎవరు వెళ్లవద్దని హెచ్చరించారు. దీంతోపాటు వర్షాలు కారణంగా ముంబైతోపాటు పలు ప్రాంతాల్లో కొన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రాలలో టీకాలను వేయడాన్ని ఆదివారం నిలిపివేశారు.   

మరిన్ని వార్తలు