Cyclone Yaas: ప్రకృతి విలయం.. విధ్వంసం

27 May, 2021 11:08 IST|Sakshi
హుగ్లీ నది ఒడ్డున బేలూరు మఠంలోకి చేరిన నీరు

రాంచీ(జార్ఖండ్​):  యాస్ తుపాను బుధవారం బీభత్సం సృష్టించింది.  పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్ర తీర ప్రాంతాల్లో ఇప్పట్లో కోలుకోలేనంత నష్టాన్ని మిగిల్చింది. పట్టపగలే చీకట్లు అలుముకోవడంతో పాటు ప్రచండ గాలులు వీచాయి. అయితే బుధవారం అర్ధరాత్రి రాత్రి తర్వాత తుపాన్​ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో వాయవ్య దిశగా పయనిస్తూ మరో పన్నెండు గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ గురువారం ఉదయం ప్రకటించింది. ఇవి చూడండి.. యాస్​ విధ్వంసం

పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరం వెంట తీరం యాస్​ తుపాన్​ దాటేటప్పుడు పరిస్థితి భయంకరంగా ఉంది. బీభత్సానికి కోటిమందికి పైగా నష్టపోయారు. అనేక ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గంటకు 150 కిలోమీటర్లతో వీచిన పెనుగాలులు ఒడిశాలోని భద్రక్‌ జిల్లాను అతలాకుతలం చేశాయి. ప్రచండ గాలుల ధాటికి కొన్ని చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరి పడ్డాయి. ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌ తీరంలో సముద్రం బాగా ముందుకొచ్చింది. వందల గ్రామాలు సముద్రపు నీటిలో చిక్కుకున్నాయి. తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఒడిశా, బెంగాల్‌లో పలు ప్రాంతాలు నీట మునిగాయి.

వారంపాటు సహాయక చర్యలు
ఒడిశాలో యాస్​ తుపాన్​ వల్ల 130కి పైగా గ్రామాలు దెబ్బతిన్నాయి. దీంతో వారం పాటు సహాయక చర్యల కార్యక్రమాలు కొనసాగుతాయని సీఎం నవీన్​ పట్నాయక్​ ప్రకటించారు. తుపాన్​తో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఈరోజు ఆయన ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. ఇక ఎటు చూసినా అడుగుల మేర నీరు, బురదతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడుతోంది. తుపాను ధాటికి పలుచోట్ల ఇళ్లు, భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు, టవర్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  ఇండియన్‌ ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో 113 టీంలను ఎన్డీఆర్​ఎఫ్​ ఏర్పాటు చేసింది. రెండురాష్ట్రాల్లో ఇప్పటికే దాదాపు 20లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాన్​ ధాటికి నలుగురు చనిపోయినట్లు సమాచారం.  

జార్ఖండ్ అలర్ట్​
రానున్న 24 గంటల్లో జార్ఖండ్​లో పిడుగులు ఉరుములతో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో జార్ఖండ్​లో హై అలర్ట్​ ప్రకటించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బుధవారం ఉదయం తర్వాత యాస్ తుఫాను పశ్చిమబెంగాల్, ఒడిశాల మధ్య తీరం దాటిన విషయం తెలిసిందే. కాగా, రెండు వారాల్లోనే రెండు తుఫాన్లు అరేబియా సముద్రం, బంగాళాఖాతంతో ఇరు తీరాలకు వణుకుపుట్టించాయి. యాస్​ తుపాన్​కి తోడు సంపూర్ణ పౌర్ణమి రావడంతో ఆటుపోట్ల వల్ల తీవ్రత ఇంకా ఎక్కువైంది. 

అగాథం వల్లే..
బంగాళాఖాతం ఈ భూమ్మీద సముద్రాల్లో 0.6శాతం ఆక్రమించి ఉంది. కానీ, ఈ భూమ్మీద తుపాన్​లతో మరణించే ప్రతీ ఐదుగురిలో నలుగురు బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్​ల వల్లే మరణిస్తున్నారని తెలుసా!.

మరిన్ని వార్తలు