యాస్‌ తుపాను బలహీనపడింది! 

28 May, 2021 10:19 IST|Sakshi

తీరం దాటిన తర్వాత బలహీనపడి వాయుగుండంగా మార్పు

నైరుతి రుతుపవనాల నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు

సాక్షి, హైదరాబాద్‌/ న్యూఢిల్లీ: యాస్‌ తుపాను గురువారం బలహీనపడి వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఇంకా బలహీనపడి తీవ్రత తగ్గుతుందని వివరించింది. ప్రస్తుతం జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్లు సూచిస్తూ, దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా లేదని స్పష్టం చేసింది. నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పూర్తిగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో చాలాభాగం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొంతభాగం వరకు బలమైన గాలులు ప్రవేశించాయని వివరించింది. రాష్ట్రానికి పశి్చమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
నైరుతి రుతుపవనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శని, ఆది, సోమవారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో ఓ మాదిరి వానలు పడతాయని వివరించింది. ఇక రాష్ట్రంలో గురువారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 22.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

మరిన్ని వార్తలు