కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగే ప్రమాదం

20 Jul, 2021 13:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికి పైగా డెల్టా వేరియంట్‌ (బి.1.617.2) వేనని ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 జినోమిక్స్‌ కన్సార్టియం సభ్యుడు డాక్టర్‌ ఎన్‌.కె.అరోరా చెప్పారు. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతికి డెల్టా వేరియంట్‌ కారణమని తెలిపారు. మరింత తీవ్రత కలిగిన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. డెల్టా కంటే ముందు ఆల్ఫా రకం కరోనా పురుడు పోసుకుంది. ఆల్ఫా కంటే డెల్టాకు 40–60 శాతం వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది.

డెల్టా ఇప్పటికే ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. యూకే, అమెరికా, సింగపూర్‌ తదితర 100కు పైగా దేశాల్లో ఈ వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. ఇక డెల్టా ప్లస్‌ ప్రభావం కూడా భారత్‌లో మొదలయ్యింది. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఇప్పటిదాకా 55–60 డెల్టా ప్లస్‌ (ఏవై1. ఏవై.2) వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. ఈ రకం కరోనా వ్యాప్తి తీరు, తీవ్రత, వ్యాక్సిన్‌ నిరోధకతపై అధ్యయనం చేస్తున్నట్లు డాక్టర్‌ అరోరా వెల్లడించారు. డెల్టా వేరియంట్‌ స్‌పైక్‌ ప్రొటీన్‌లో మార్పులు (మ్యుటేషన్స్‌) జరుగుతున్నాయని, తద్వారా వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని సంతరించుకుంటోందని, అంతేకాకుండా మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతోందన్నారు.

మరిన్ని వార్తలు