దళిత యువకుడిపై దాడి.. గ్రామ సర్పంచ్‌ అరెస్ట్‌.. వీడియో వైరల్‌!

21 Aug, 2022 21:36 IST|Sakshi

లక్నో: ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. అందరి ముందు యువకుడిపై గ్రామ సర్పంచ్‌ చెప్పుతో దాడి చేసి, చంపేస్తామని బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్‌, మాజీ సర్పంచ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై దాడి నేపథ్యంలో భీమ్‌ ఆర్మీ కార్యకర్తలు ఛాపర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు.  

పోలీసుల వివరాల ప్రకారం.. దినేష్‌ కుమార్‌(27) అనే దళిత యువకుడిపై.. తాజ్‌పుర్‌ గ్రామ సర్పంచ్‌ శక్తి మోహన్‌ గుర్జార్‌, రేటా నగ్లా గ్రామ మాజీ సర్పంచ్‌ గాజే సింగ్‌లు దాడి చేశారు. చెప్పుతో కొడుతూ చంపేస్తామని యువకుడిని బెదిరించారు. వీడియోలు తీసి ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. భారతీయ శిక్షా స్మృతి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు నగర ఎస్పీ అర్పిత్‌ విజయ్‌వర్గియా తెలిపారు. గ్రామ సర్పంచ్‌ శక్తి మోహన్‌ను అరెస్ట్‌ చేశామని, రెండో వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: Viral Video: గేదె ముందు యువతి కుంగ్‌ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో..

>
మరిన్ని వార్తలు