అగ్రి సెస్‌తో రాష్ట్రాలకు నష్టం

3 Feb, 2021 05:38 IST|Sakshi

న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం తాజా బడ్జెట్‌లో ‘అగ్రి సెస్‌ (అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌–ఏఐడీసీ)’ను ప్రవేశపెట్టారు. పెట్రోలు, డీజిల్‌లతో పాటు బంగారం, వెండి తదితర 12 వస్తువులపై ఈ సెస్‌ విధించనున్నారు. ఈ సెస్‌ కారణంగా వినియోగదారులపై భారం పడకుండా కస్టమ్స్, ఎక్సైజ్‌ సుంకాలలో సర్దుబాటు చేస్తామని ఆర్థికమంత్రి బడ్జెట్‌ సందర్భంగా వివరణ ఇచ్చారు. సాధారణంగా కేంద్ర పన్నుల్లో 41% రాష్ట్రాల వాటాగా ఉంటుంది. కానీ, సర్‌చార్జ్‌లు, సెస్‌లలో రాష్ట్రాలకు వాటా లభించదు. దాంతో, అగ్రి సెస్‌ కారణంగా కస్టమ్స్, ఎక్సైజ్‌ సుంకాలలో వాటా ద్వారా లభించే ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోతాయి.

అగ్రి సెస్‌ నుంచి రాష్ట్రాలకు  ప్రత్యక్ష ప్రయోజనం ఉండదు. అగ్రిసెస్‌ ద్వారా రూ. 30 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి పాండే వెల్లడించారు. తాత్కాలిక, ప్రత్యేక లక్ష్యాల కోసమే సెస్‌ విధించాలని, వ్యవసాయ మౌలిక వసతుల వంటి సాధారణ లక్ష్యాలకు సెస్‌ సరికాదని గణాంక నిపుణుడు ప్రణబ్‌ సేన్‌ వ్యాఖ్యానించారు. ఈ సెస్‌ వల్ల కేంద్రం సేకరించే కస్టమ్స్‌ డ్యూటీ నుంచి రాష్ట్రాలు తమ వాటా ఆదాయాన్ని కోల్పోతాయన్నారు. అయితే, సాధారణంగా కేంద్రం పెట్రోలు, డీజిల్‌లపై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా లభించిన ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోదని,  సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీలో సర్దుబాటు చేసే అగ్రిసెస్‌ ద్వారా రాష్ట్రాలకు ఆదాయ పరంగా నష్టం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌లో... 
గత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు పరిగణలోకి తీసుకుంటే అగ్రి సెస్‌ రూపంలో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు ద్వారా కేంద్రానికి రూ.2,016.33 కోట్ల ఆదాయం సమకూరనుంది. 2019–20 లో రాష్ట్రంలో 401.27 కోట్ల డీజిల్, 164.42 కోట్ల పెట్రోల్‌ అమ్మకాలు జరిగాయి. దీని ప్రకారం డీజిల్‌ పై లీటరుకు రూ.4 అగ్రి సెస్‌ పరిగణలోకి తీసుకుంటే ఏటా రూ.1,605.33 కోట్లు సమకూరనున్నాయి. ఇదేసమయంలో 164.54 కోట్ల లీటర్ల పెట్రోలు అమ్మకాలు జరిగాయి. లీటరు పెట్రోలు పై విధించిన రూ.2.50 అగ్రిసెస్‌ పరిగణలోకి తీసుకుంటే రూ.411.25 కోట్లు కేంద్రానికి ఆదాయం గా రానున్నది. 

తెలంగాణలో.. 
తెలంగాణ విషయానికొస్తే ఏటా రూ.237 కోట్లకుపైగా నష్టం ఉంటుందని అంచనా.  రాష్ట్రంలో నెలకు సగటున (2020, డిసెంబర్‌ అమ్మకాల ప్రకారం) 12.23 కోట్ల లీటర్ల పెట్రోల్, 23.11 కోట్ల డీజిల్‌ వినియోగం జరుగుతుంది. ఈ విక్రయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు పలు రూపాల్లో ఉంటాయి. రాష్ట్ర పన్నుల రాబడులు నేరుగా మన ఖజానాకు చేరితే కేంద్రం విధించే పన్నుల్లో మనకు వాటా వస్తుంది. తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం డీజిల్‌పై లీటర్‌కు రూ.4, పెట్రోల్‌పై రూ.2 ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించి, ఆ మేరకు సెస్‌ పెంచింది. ఎక్సైజ్‌ డ్యూటీలో రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఉంటుంది కానీ, సెస్‌ ద్వారా వసూలు చేసుకునే దానిలో రాష్ట్రాలకు రూపాయి రాదు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో నెలకు జరిగే మొత్తం విక్రయాల్లో డీజిల్‌పై లీటర్‌కు రూ.4 చొప్పున రూ.92.44 కోట్లు, పెట్రోల్‌పై రూ.2 చొప్పున రూ.24.46 కోట్లు ఎక్సైజ్‌డ్యూటీ తగ్గిపోతుంది.

అదే సంవత్సరానికి వస్తే డీజిల్‌పై రూ.1109.28 కోట్లు, పెట్రోల్‌పై 293.52 కోట్లు డ్యూటీ రాదు. దీంతో ఈ డ్యూటీలో రాష్ట్రానికి వచ్చే వాటా రాకుండా పోతుంది. కేంద్ర పన్నుల్లో వాటా ప్రకారం మన రాష్ట్రానికి ఈ మొత్తం రూ.1402.80 కోట్లలో రావాల్సిన 2.4 శాతం వాటా రాకుండా పోతోంది. ఇది రూ. 33.64 కోట్లు ఉంటుందని అంచనా. అదే విధంగా కేంద్రం విధించే ఎక్సైజ్‌ డ్యూటీపై రాష్ట్రం అదనంగా 14.5 శాతం పన్ను వసూలు చేసుకుంటుంది. ఇప్పుడు రూ.1402 కోట్ల మేర డ్యూటీ తగ్గిపోవడంతో ఆ మేరకు రాష్ట్ర ఖజానాకు గండిపడనుంది. ఈ మొత్తం రూ.203.40 కోట్లు ఉంటుందని వాణిజ్య పన్నుల అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే అటు ఎక్సైజ్‌ డ్యూటీ వచ్చే వాటా, ఇటు ఎక్సైజ్‌ డ్యూటీపై విధించే రాష్ట్ర పన్ను కలిపితే మొత్తం రూ. 237.04 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా నష్టపోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు