కాలేజీ ఈవెంట్‌లో బుర్ఖా ధరించి బాయ్స్‌ డ్యాన్స్‌.. నలుగురు సస్పెండ్‌

9 Dec, 2022 14:54 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్‌ వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. మంగళూరులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో బుర్ఖా ధరించి నలుగురు విద్యార్థులు బాలీవుడ్‌ పాటకు డ్యాన్స్ చేశారు. బుర్ఖా ధరించి నలుగురు బాయ్స్‌ నృత్యం చేస్తున్న వీడియో వైరల్‌గా మారిన క్రమంలో వారిని సస్పెండ్‌ చేసింది కాలేజీ యాజమాన్యం. ప్రస్తుతం ఈ సంఘటన కర్ణాటకలో వివాదాస్పదంగా మారింది.

సెయింట్‌ జోసెఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నలుగురు బాయ్స్‌ బుర్ఖా ధరించి నృత్యం చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారిన క్రమంలో కళాశాల యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మతపరమైన సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఇలాంటి డ్యాన్సులకు అనుమతి ఇవ్వటమేంటని పలువురు ప్రశ్నించారు. 

మరోవైపు.. బాలీవుడ్‌ సాంగ్‌కు తాము అనుమతించలేదని, విద్యార్థులు తమకు తెలియకుండా స్టేజ్‌ పైకి వెళ్లారని కాలేజీ అధికారులు తెలిపారు. తమ కళాశాల మార్గదర్శకాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ‘కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం వర్గానికి చెందిన విద్యార్థులు స్టేజ్‌పైకి వెళ్లి డ్యాన్స్‌ చేశారు. అప్పుడు తీసిన వీడియో వైరల్‌గా మారింది. అది కళాశాల ఆమోదించిన కార్యక్రమంలో భాగం కాదు. వేదికపైకి వెళ్లి డ్యాన్స్‌ చేసిన నలుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేశాం. దర్యాప్తు జరుగుతోంది.’ అని కళాశాల ప్రిన్సిపాల్‌ ఓ ప్రకటన చేశారు. మతసామరస్యాలను దెబ్బతీసే కార్యక్రమాలను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో ఖర్చు ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు