మరణానంతరం పులిట్జర్‌.. మరో ముగ్గురు భారతీయులకు కూడా!

10 May, 2022 14:55 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయ ఫొటోగ్రాఫర్‌ డానిష్ సిద్దిఖికి రెండోసారి పులిట్జర్‌ ప్రైజ్‌ దక్కింది. మరణానంతరం ఆయనకు ఫీచర్‌ ఫొటోగ్రఫీ కేటగిరీలో ఈ విశిష్ట గౌరవం విశేషం. డానిష్‌తో పాటు మరో ముగ్గురు భారతీయులకు సైతం ఈ గౌరవం దక్కింది.  ఈ నలుగురికీ భారత్‌లో కొవిడ్‌ పరిస్థితుల మీద తీసిన ఫొటోలకే అవార్డులు దక్కడం విశేషం.
 
రాయిటర్స్‌ ఫొటోగ్రాఫర్‌ అయిన డానిష్ సిద్దిఖి.. కిందటి ఏడాది అఫ్గన్‌ ప్రత్యేక దళాలు-తాలిబన్ల మధ్య ఘర్షణల్లో విధి నిర్వహణలో ఉండగానే తుటాలకు బలైన విషయం తెలిసిందే. పులిట్జర్‌ ప్రైజ్‌ 2022 విజేతలను సోమవారం ప్రకటించారు. జర్నలిజం, రచనలు, నాటకం, సంగీతం.. రంగాల్లో పులిట్జర్‌ ప్రైజ్‌ను అందిస్తారని తెలిసిందే.
 
డానిష్‌ సిద్ధిఖితో పాటు అమిత్‌ దవే, అద్నన్‌ అబిది, సన్నా ఇర్షద్‌ మట్టోలకు పురస్కారం ప్రకటించారు. 2018లో రొహింగ్యా శరణార్థ సంక్షోభం మీద తీసిన ఫొటోలకు గానూ అద్నాన్‌ అబిదితో కలిసి తొలిసారి పులిట్జర్‌ అందుకున్నారు డానిష్‌ సిద్ధిఖి.

అదే సమయంలో వివిధ కేటగిరీలతో పాటు ఉక్రెయిన్‌ సంక్షోభం, అమెరికా జనవరి 6 కాపిటోల్‌ మీద దాడి, అఫ్గన్‌ గడ్డ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ, ఫ్లోరిడాలో సముద్రతీరంలో సగ భాగం కుప్పకూలిన భవనం లాంటి వాటి మీద కవరేజ్‌లకు సైతం ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు పులిట్జర్‌ ప్రైజ్‌ నిర్వాహకులు. 1917లో కొలంబియా యూనివర్సిటీ నిర్వాహకుడు, ప్రముఖ పాత్రికేయుడు జోసెఫ్‌ పులిట్జర్‌ పేరు మీద ఈ గౌరవాన్ని అందిస్తూ వస్తున్నారు.

మరిన్ని వార్తలు