పెళ్లి చేసుకోకపోయినా ఖర్చులు రాబట్టుకోవచ్చు.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు

31 Mar, 2022 17:07 IST|Sakshi

రాయ్‌పూర్‌: వివాహం కానప్పటికీ కుమార్తె తన తల్లిదండ్రుల నుంచి పెళ్లిఖర్చులను రాబట్టుకోవచ్చని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, 1956లోని నిబంధనల ప్రకారం.. పెళ్లికాని కుమార్తె తన తల్లిదండ్రుల నుంచి వివాహ ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 35 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బిలాస్‌పూర్‌లోని హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. తన తండ్రి నుంచి వివాహ ఖర్చులు ఇప్పించాలని ఆమె వేసిన పిటిషన్‌ను జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్‌ సంజయ్ ఎస్ అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 21న విచారణకు అనుమతించిందని పిటిషనర్ న్యాయవాది ఎకె తివారి తెలిపారు. 

బిలాయ్‌ స్టీల్‌ ప్లాంట్‌(బీఎస్‌పీ) ఉద్యోగి అయిన తన తండ్రి భాను రామ్‌ కు పదవీ విరమణ ద్వారా రూ.55 లక్షలు రానున్నాయని.. ఇందులో తనకు రూ. 20 లక్షలు ఇచ్చేలా బీఎస్‌పీని ఆదేశించాలని 2016, జనవరి 7న దుర్గ్ జిల్లా కుటుంబ న్యాయస్థానాన్ని రాజేశ్వరి ఆశ్రయించారు. అయితే ఆమె అభ్యర్థనను జిల్లా కోర్టు తిరస్కరించింది. కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. 

చట్టం ప్రకారం.. పెళ్లికాని కుమార్తె తన తండ్రి నుంచి వివాహ ఖర్చులను డిమాండ్ చేయవచ్చని.. ఆ ఖర్చు మెయింటెనెన్స్ పరిధిలోకి వస్తుందని హైకోర్టుకు విన్నవించినట్టు రాజేశ్వరి తరపు న్యాయవాది తివారి తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించిందని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ఈ తరహా తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. (క్లిక్: ఆ 72 మంది ఎంపీలతో ప్రధాని ఫొటో సెషన్‌)

మరిన్ని వార్తలు