పాకిస్తాన్‌లో దావూద్‌ ఇబ్రహీం.. ‘మోదీ పట్టుకుంటారా ?’

24 May, 2022 16:48 IST|Sakshi

ముంబైలో గ్యాంగ్‌స్టర్, కీలక కేసుల్లో నిందితుడైన దావూద్ ఇబ్రహీం గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) కీలక సమాచారం బయటపెట్టింది. దాయాది దేశం పాకిస్తాన్‌లోనే దావూద్‌ ఇబ్రహీం ఉన్నట్టు తెలిపింది. 

అయితే, కొన్ని రోజుల నుండి దావూడ్‌ సంబంధిన అన్ని విభాగాలపై ఈడీ ఫోకస్‌ పెట్టింది. అందులో భాగంగానే మనీలాండరింగ్​ కేసులో విచారణకు హాజరుకావాలని దావూద్‌ సోదరి హాసీనా పార్కర్‌ కుమారుడు అలిశా పార్కర్​కు ఈడీ సమన్లు జారీ చేసింది. అనంతరం పార్కర్‌ను విచారించే క్రమంలో దావూద్‌ పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నాడని అతడు తెలిపాడు. దీంతో దావూద్‌ పాకిస్తాన్‌లోనే ఉన్నాడంటూ పలు సందర్భాల్లో బయటకు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. 

ఇక, ఈడీ విచారణ సందర్భంగా పార్కర్‌.. ‘‘నేను పుట్టుక ముందే తన మామ(దావూద్‌ ఇబ్రహీం) ముంబై వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం వాళ్లు భారత్‌ను వదిలి.. పాకిస్తాన్‌లో ఉంటున్నట్టు మా బంధువుల ద్వారా తెలిసింది. అయితే, ఇంతకు ముందు కొన్నిసార్లు ఈద్‌, ఇతర పండుగలకు దావూర్‌ భార్య మెహ్జబీన్‌.. తన భార్య ఆయేషా, తన సోదరితో మాట్లాడింది.’’ అని చెప్పినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. దీంతో దావూద్‌.. పాకిస్తాన్‌లో ఉన్నాడని రుజువైంది. ఈడీ ప్రకటన బయటకు వచ్చిన తర్వాత.. దావూద్‌ ఇబ్రహాంను పట్టుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్‌ వాల్సే డిమాండ్‌ చేశారు. 

అంతకుముందు.. మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్‌సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌ను అక్రమార్జన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో భాగంగా మాలిక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీఎంఎల్‌ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మాలిక్‌ను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుచగా.. కోర్టు ఈడీ కస్టడీ విధించింది. దీంతో నవాబ్‌ మాలిక్‌ వ్యవహారంలో బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను పట్టుకోవాలని ప్రధాని మోదీకి ఉద్ధ‌వ్ థాక్రే సవాల్‌ విసిరారు.

ఇది కూడా చదవండి: బీజేపీకి దమ్ముంటే దావూద్‌ ఇబ్రహీంను పట్టుకొని చంపండి.. మోదీకి సవాల్‌

మరిన్ని వార్తలు