Gennova: దేశంలోనే తయారైన తొలి ఎంఆర్‌ఎన్‌ఏ కరోనా వ్యాక్సిన్‌! దీని ప్రత్యేకత ఏంటంటే..

29 Jun, 2022 08:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: అర్ధరాత్రి పరిణామాల నడుమ.. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(DCGI) తొలి స్వదేశీ ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వినియోగానికి అత్యవసర అనుమతులు జారీ చేసింది. పూణేకి చెందిన జెన్నోవా బయోఫార్మాసూటికల్స్‌ ఈ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను వృద్ధి చేసింది. సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌కమిటీ(SEC) ఈ వ్యాక్సిన్‌ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెబుతూ.. అత్యవసర వినియోగం శుక్రవారం ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో.. డీసీజీఐ మంగళవారం రాత్రి అనుమతులు జారీ చేసింది. 

రెండు డోసులతో పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లు.. 28 రోజుల టైంతో ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత పూర్తి స్వదేశీయంగా తయారైన ఈ వ్యాక్సిన్‌కు ఉన్న అసలైన ప్రత్యేకత ఏంటంటే.. రెండు నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ మధ్య కూడా ఈ వ్యాక్సిన్‌ను స్టోరేజ్‌ చేయొచ్చు. దేశంలోనే ఈ తరహా వ్యాక్సిన్‌ ఇదే మొదటిది కావడం గమనార్హం. సాధారణంగా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌లను.. అత్యంత లో-టెంపరేచర్‌లలో(సున్నా అంతకంటే తక్కువ) భద్రపరిచి.. సరఫరా చేస్తారు. అలాంటిది జెన్నోవా వ్యాక్సిన్‌కు అలాంటి ఆటంకాలేవీ లేవని కంపెనీ చెబుతోంది.

పూణేకు చెందిన  జెన్నోవా బయోఫార్మాసూటికల్స్‌.. దేశంలోనే తొలి కొవిడ్‌-19 m-RNA వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మూడు దశలుగా ఈ వ్యాక్సిన్‌ టెస్టింగ్‌లకు సంబంధించిన నివేదికలను డ్రగ్‌ రెగ్యులేటరీకి సమర్పించింది కూడా. ఫేజ్‌2, 3లను నాలుగు వేలమందిపై ప్రయోగించింది కంపెనీ. జెన్నోవా వ్యాక్సిన్‌తో పాటు సీరం ఇనిస్టిట్యూట్‌ రూపొందించిన కోవోవాక్స్‌ అత్యవసర వినియోగానికి (ఏడు నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు) డ్రగ్‌ రెగ్యులేటర్‌ అప్రూవ్‌ ఇచ్చింది.

చదవండి: వైరస్‌ రూపాలెన్ని మార్చినా.. ఏమార్చే టీకా! 

మరిన్ని వార్తలు