అర్ధరాత్రి నడిరోడ్డుపై డీసీడబ్ల్యూ చీఫ్‌.. లైంగిక వేధింపులు.. కారుతో ఈడ్చుకెళ్లిన తాగుబోతు

19 Jan, 2023 16:37 IST|Sakshi

ఢిల్లీ:  ప్రముఖ ఉద్యమకారిణి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ భయానక అనుభవం ఎదుర్కొన్నారు. ఓ యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన చంపిన ఘటన తర్వాత.. ఢిల్లీలో మహిళల భద్రతను పర్యవేక్షించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు ఆమె. అయితే.. ఈ ప్రయత్నంలో కారులో తప్పతాగి వచ్చిన ఓ వ్యక్తి నడిరోడ్డుపై ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు ప్రతిఘటించడంతో కొద్దిదూరం అతని కారుతో సహా లాక్కెల్లాడు. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడగా.. ఆమె ఆ భయానక అనుభవాన్ని పంచుకున్నారు.

అంజలి సింగ్‌ ఘటన తర్వాత.. ఢిల్లీలో మహిళల భద్రతపై తన బృందంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌. ఈ క్రమంలో.. బుధవారం అర్ధరాత్రి మూడు గంటల తర్వాత ఎయిమ్స్ వద్ద కాలిబాటలో ఆమె నిల్చున్నారు. అంతలో ఓ బాలెనో కారులో దూసుకొచ్చిన వ్యక్తి.. ఆమెను చూసి ఆగిపోయాడు. కారులో ఎక్కమంటూ ఆమెను బలవంతం చేయబోయాడు.  ఆమె నిరాకరించడంతో అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి.. యూటర్న్‌ తీసుకుని మళ్లీ వచ్చాడు.

మరోసారి కారు ఎక్కమంటూ ఆమెను కోరగా.. ఆమె అతన్ని కిటీకి నుంచి బయటకు లాగే యత్నం చేసింది. అయితే.. కిటీకిని క్లోజ్‌ చేయడంతో ఆమె చెయ్యి అందులో ఇరుకుపోయింది. అలా.. 15 మీటర్లపాటు కారు దూసుకెళ్లగా, ఆమె కిటికీలోంచి చెయ్యిని విడిపించుకుంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న టీం ఆమెకు సాయంగా వచ్చారు. ఆపై సదరు వ్యక్తి మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవుడే తనను రక్షించాడని, ఢిల్లీలో ఒక మహిళా కమిషన్‌  చైర్‌పర్సన్‌కే ఇలా జరిగితే.. పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని ఆమె ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఆ వ్యక్తిని నలభై ఏడేళ్ల హరీశ్‌చంద్రగా గుర్తించి.. కారును సీజ్‌ చేశారు. 

కొత్త సంవత్సరం రోజున.. స్నేహితురాలితో స్కూటీ మీద వస్తున్న అంజలి సింగ్‌(20)ను ఢీ కొట్టారు దుండగులు. ఆపై సుల్తాన్‌పురి నుంచి కంఝావాలా మధ్య పదమూడు కిలోమీటర్లపాటు ఆమె శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ ఘోర ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోగా.. దేశవ్యాప్తంగా ఈ హిట్‌ అండ్‌ రన్‌ కేసు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు