Mohan Bhagwat: భారతీయులందరిదీ ఒక్కటే డీఎన్‌ఏ!

5 Jul, 2021 09:20 IST|Sakshi

భారత్‌లో ఇస్లాం మతం ప్రమాదంలో పడిందన్న కొందరి అసత్య ప్రచారాలను నమ్మొద్దని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అసలు అలాంటి ప్రచారాల వలలో చిక్కుకోవద్దని ముస్లింలను కోరాడు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్‌. 

ఘజియాబాద్‌: ఆ గడ్డపై హిందూ-ముస్లిం తేడాలేవీ లేవని.. భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటేనని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ భగవత్‌ పునరుద్ఘాటించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లిం రాష్ట్రీయ మంచ్‌(ఆరెస్సెస్‌ ముస్లిం విభాగం) ఏర్పాటు చేసిన  ‘హిందుస్తానీ ఫస్ట్‌.. హిందుస్తాన్‌ ఫస్ట్‌’ అనే కార్యక్రమంలో భగవత్‌ ప్రసంగించారు. ప్రజలు చేసే ఆరాధనలను బట్టి వారిని వర్గాలుగా విభజించలేమని అన్నారు. మూక దాడులకు పాల్పడే వాళ్లు హిందుత్వానికి వ్యతిరేకులేనని తేల్చిచెప్పిన ఆయన.. మూకదాడులపై కొన్ని సందర్భాల్లో తప్పుడు కేసులు నమోదవుతున్నాయని ఆక్షేపించారు.


 
ఏ ఒక్క మతమో కాదు 
దేశంలో ప్రజల మధ్య ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు. ‘‘హిందు, ముస్లిం వర్గాలు వేర్వేరు కాదు. మతాలతో సంబంధం లేకుండా భారతీయులందరి డీఎన్‌ఏ ఒక్కటే. జాతీయవాదం, మన పూర్వీకులు సాధించిన కీర్తి ప్రజల మధ్య ఐక్యతకు ఆధారం కావాలి. హిందు–ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలకు పరిష్కార మార్గం చర్చలే.  ఈ రెండు వర్గాల ఐక్యతపై తప్పుడు ప్రచారం సాగుతోంది. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, దేశంలో ఏ ఒక్క మతమో ఆధిపత్యం చెలాయించలేదు. కేవలం భారతీయులు మాత్రమే ఆధిపత్యం చెలాయించగలర’’ని మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యానించారు. కాగా, తాను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో, వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికో ఈ కార్యక్రమానికి రాలేదని, దేశాన్ని బలోపేతం చేయడానికి.. సమాజంలో అందరి బాగు కోసం ఆరెస్సెస్‌ పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

 

అది అభివృద్ధికి ముప్పే!
వివిధ రంగాలకు చెందిన 150 మంది ముస్లిం ప్రముఖులతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. జనాభా విపరీతంగా పెరగడం రాష్ట్ర అభివృద్ధికి ముప్పేనని ముస్లిం ప్రముఖులు అంగీకరించారని సమావేశం అనంతరం సీఎం కామెంట్‌ చేశారు. ఈ మేరకు అభివృద్ధి కోసం సూచనలు చేయడానికి వారితో 8 ఉపవర్గాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు