ప్రసవంలో బిడ్డ మరణిస్తే.. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు

2 Sep, 2022 20:53 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం మరో కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రసవం సమయంలో బిడ్డ గనుక మరణిస్తే.. ఆ తల్లులకు 60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

ప్రసవం సమయంలోగానీ లేదంటే పుట్టిన కాసేపటికే గానీ బిడ్డ చనిపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ఈ సెలవులు వర్తిస్తాయని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌(DoPT) శుక్రవారం తన ఆదేశాల్లో వెల్లడించింది. బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతే.. ఆ తల్లి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని, అందువల్ల కలిగే మానసిక క్షోభను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీవోపీటీ ఆ ప్రకటనలో తెలిపింది.

ప్రసవ సమయంలో బిడ్డ చనిపోవడం, మెటర్నీటీ లీవుల విషయంలో చాలామంది ఉద్యోగులు ఎంక్వైరీలు, విజ్ఞప్తులు చేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించాకే ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రకటించింది డీవోపీటీ.  

ఒకవేళ మెటర్నీటీ లీవులు గనుక ఉంటే.. అవి వర్తిస్తాయని, అవి అందుబాటులో లేకుంటే 60 రోజుల ప్రత్యేక మెటర్నిటీ లీవులు వర్తిస్తాయని(బిడ్డ మరణించిన నాటి నుంచి) సదరు ప్రకటన తెలిపింది. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే మరణించే పరిస్థితిని పుట్టిన 28 రోజుల వరకు నిర్వచించవచ్చని అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రత్యేక ప్రసూతి సెలవుల ప్రయోజనం.. ఇద్దరు పిల్లల కంటే తక్కువ సంతానం ఉన్న కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగికి, అథరైజ్డ్‌ ఆస్పత్రిలో పిల్లల ప్రసవం జరిగితేనే వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద గుర్తింపు ఉన్న ప్రైవేట్‌ లేదంటే ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే ప్రసవం జరగాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంప్యానెల్ లేని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర ప్రసవాలు జరిగితే, అత్యవసర ధృవీకరణ పత్రం తప్పనిసరి అని పేర్కొంది.

ఇదీ చదవండి: బాహుబలి.. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌

మరిన్ని వార్తలు