నవ సంకల్పంతో ముందడుగు

25 May, 2022 06:10 IST|Sakshi

కార్యాచరణ బాటలో కాంగ్రెస్‌ పార్టీ 

రాజకీయ వ్యవహారాలు, టాస్క్‌ ఫోర్స్‌–2024, భారత్‌ జోడో  యాత్ర సమన్వయ గ్రూపులు ఏర్పాటు 

రాహుల్, ప్రియాంకలకు ప్రాధాన్యత

సాక్షి, న్యూఢిల్లీ: ఉదయ్‌ పూర్‌ నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణలో పెట్టడం ప్రారంభించింది. అందులో భాగంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్‌ అధిష్టానం మంగళవారం మూడు ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసింది. ఈ బృందాల్లో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు జీ–23 గ్రూపులో అసమ్మతి నేతలకూ అవకాశం కల్పించారు.

ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సోనియాగాంధీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవహారాల గ్రూప్‌లో రాహుల్‌ గాంధీతో పాటు జీ–23లో కీలక సభ్యులైన గులామ్‌ నబీ ఆజాద్, ఆనంద శర్మలకు అవకాశం కల్పించారు. ఇంకా ఇందులో మల్లికార్జున ఖర్గే, అంబికా సోని, దిగ్విజయసింగ్, , కేసీ వేణుగోపాల్, జితేంద్ర సింగ్‌ సభ్యులుగా ఉన్నారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌ గ్రూపులో చిదంబరం, ముకుల్‌ వాస్నిక్, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, అజయ్‌ మాకెన్, ప్రియాంక గాంధీ, రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా, సునీల్‌ కనుగోలు ఉన్నారు. భారత్‌ జోడో యాత్ర సమన్వయానికి వేసిన గ్రూప్‌లో దిగ్విజయ్‌సింగ్, సచిన్‌ పైలట్, శశిథరూర్‌ తదితరులున్నారు.

రాజ్యసభకు ప్రియాంకగాంధీ..?
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కర్ణాటక లేక రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు పంపాలని యోచిస్తోందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచే రాజ్యసభకు ప్రియాంకను పంపుతారని సమాచారం. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం తర్వాత ఆ రాష్ట్రం నుంచి ప్రియాంకను రాజ్యసభకు పంపే ఆలోచనలు మానుకున్నారు. 

మరిన్ని వార్తలు