మహారాష్ట్రలో తగ్గుతున్న కరోనా కేసులు

10 Nov, 2020 12:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పెరుగుతున్న కరోనా రికవరీలు

ముంబై: దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతున్న.. అదే స్థాయిలో రికవరీలు నమోదు కావటం హర్షనీయం. మహారాష్ట్రలో కోవిడ్‌-19 కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇప్పటికే హోం క్వారంటైన్‌లో ఉన్న రోగుల సంఖ్య గడిచిన ఎనిమిది రోజుల్లో 58 శాతానికి తగ్గింది. అయితే దీపావళీ తరువాత కేసులు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నవంబర్‌ 1న మొత్తం 25,44,799 రోగులు హోం క్వారంటైన్‌ తీసుకోగా, ఆ సంఖ్య ఆదివారానికి 10,51,321 తగ్గింది. ఆదివారం ఒక్క రోజే 8,232 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో గత రెండు వారాల్లో 70 వేల కరోనా టెస్టులు నిర్వహించగా రోజుకి సగటున 7 వేలు కేసులు నమోదయ్యాయి. స్వల్ప రోగ లక్షణాలున్న రోగుల రికవరీ బాగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు అత్యధికంగా హాట్‌స్పాట్ల వద్దే నమోదయ్యాయి. కేసులు ఎక్కువగా నమోదయ్యే ముంబై, పూణె నగరాల్లో యాక్టివ్‌ కేసులు 17 వేలకు తగ్గాయని రాష్ట్ర నిఘా అధికారి డాక్టర్‌ ప్రదీప్‌ అవతే తెలిపారు.

రాష్ట్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. కొల్హాపూర్‌(323), ధూలే(317), వాషిమ్‌(107), నందూర్‌బర్‌(429) జిల్లాల్లో అత్యల్ప యాక్టివ్‌ కేసులున్నాయి. ఆసుపత్రుల్లో ఉన్న రోగుల సంఖ్య కూడా 35 శాతానికి తగ్గింది. లాక్‌డౌన్‌ సడలింపులు ఉన్నప్పటికీ వైరస్‌ వ్యాప్తిని అదుపు చేయగలిగామని, రాబోయే 15 రోజుల్లో వైరస్‌ వ్యాప్తి అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ఆరోగ్య సేవా డైరెక్టర్‌ డాక్టర్‌ అర్చన పాటిల్‌ తెలిపారు. అయితే ఆరోగ్య కార్యకర్తలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన యాక్టివ్‌ కేసుల సంఖ్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ క్రమంగా సడలిస్తూండటం వల్లే కేసులను తక్కువగా చూపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న రోగులకు కోలుకునే ముందు ఎటువంటి టెస్టులు చేయడం లేదని.. రైళ్లు, ఆఫీసులు తెరుచుకునే క్రమంలో రోగులను ఆరోగ్యశాఖ గుర్తించడం కష్టం కాబట్టి వారు ముందుగా అప్రమత్తమవ్వాలని ఆరోగ్య కార్యకర్త డాక్టర్‌ అభిజిత్‌ మోర్‌ అన్నారు.  (పాజిటివ్‌... కానీ లక్షణాలు లేవు)

మరిన్ని వార్తలు