ఎవరీ దీపూ సిద్ధూ? నిన్న ఢిల్లీలో ఏం చేశాడు?

27 Jan, 2021 13:36 IST|Sakshi

అతడి చుట్టూ ఢిల్లీ నిరసనల పరిణామాలు

న్యూఢిల్లీ: రైతు గణతంత్ర పరేడ్‌ పేరిట రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామాలకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విధ్వంసానికి కారకులెవరో గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో డ్రోన్‌ కెమెరాలు.. సీసీ టీవీ ఫుటేజీ, పోలీసుల కెమెరాలు, మీడియాలో వచ్చిన వాటిని పరిశీలిస్తున్నారు. అయితే ఢిల్లీలో విధ్వంసానికి దీపూ సిద్ధూ ప్రధాన కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. విధ్వంసానికి కారణం దీపూ సిద్ధూ అని రైతు సంఘాలు కూడా ప్రకటించాయి.

శాంతియుతంగా తాము చేపట్టాలనుకున్న ఉద్యమంలో దీపు రావడంతో విధ్వంసం మొదలైందని రైతు సంఘాలు వెల్లడించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం జరిగిన పరిణామాలను చూసి తమ ఉద్యమంలోకి విద్రోహ శక్తులు వచ్చాయని ముందే రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ క్రమంలో అందరూ గుర్తించిన దీపు సిద్ధూ ఎవరనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సిద్దూ ఎవరో కాదు ఎర్రకోటపై జెండా ఎగురవేసిన వ్యక్తి. అన్ని అడ్డంకులు తొలగించుకుని ఎర్రకోటపైకి చేరి రెండు జెండాలు ఎగురవేసిన విషయం తెలిసిందే. జెండా ఎగురవేయడంతో పాటు ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వీడియోలు, ఫొటోలు వచ్చాయి. దీంతో ఢిల్లీలో జరిగిన పరిణామాలకు ప్రధాన కారణం దీపు సిద్ధూ అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఎవరీ సిద్ధూ?
పంజాబ్‌లోని ముక్తసర్‌ జిల్లాకు చెందిన దీపూ సిద్ధూ 1984లో జన్మించాడు. ఇతడు సినీ నటుడే కాకుండా సామాజిక కార్యకర్త కూడా. 2015లో రమ్తా జోగి సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌కు సహాయకుడిగా సిద్దూ ఉన్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గురుదాస్‌పూర్‌ నుంచి బీజేపీ తరఫున సన్నీ డియోల్‌ పోటీ చేయగా సిద్ధూ మొత్తం వ్యవహారం నడిపించాడు. అతడు బీజేపీ నాయకుడిగా గుర్తింపు పొందాడని తెలుస్తోంది. దానికి గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌ షాను కలిసి దిగిన ఫొటోలు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పుడు ఆ ఫొటోలు వైరలయ్యాయి. రైతు ఉద్యమంలో ప్రధానంగా సిద్ధూ కనిపించడంతో ఉద్యమంలో అలజడులు లేపేందుకు బీజేపీ కుయుక్తులు పన్నిందని రైతు సంఘాలతో పాటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

41 రైతుల సంఘాలతో కూటమిగా ఏర్పడిన సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. శంభు సరిహద్దుల్లో సిద్దూ రాగానే విధ్వంసం మొదలైందని.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడానికి అతడే కారణమని పేర్కొంది. ఈ విషయంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌ కూడా పరోక్షంగా మద్దతు తెలిపాడు. అయితే తాను సిక్కుల జెండాతో పాటు రైతుల జెండా ఎగురవేశానని సోషల్‌ మీడియా వేదికగా సిద్ధూ ప్రకటించాడు. రైతుల ఐక్యత వర్ధిల్లాలి అని నినదించినట్లు తెలిపాడు. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సిద్ధూపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే ఢిల్లీలో  మంగళవారం జరిగిన పరిణామాలపై ఓ నివేదిక సిద్ధమైనట్టు సమాచారం. కొందరిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం నివేదిక వచ్చాక పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర హోంమంత్రి శాఖ దృష్టి సారించింది.

మరిన్ని వార్తలు