ఉపాధి స్కామ్‌ : నకిలీ జాబ్‌ కార్డులతో అవినీతి

16 Oct, 2020 12:41 IST|Sakshi

భోపాల్‌ : జాతీయ ఉపాథి హామీ పథకానికి సంబంధించి మధ్యప్రదేశ్‌లో మరో గోల్‌మాల్‌ చోటుచేసుకుంది. జిర్న్యా జిల్లా పిపర్‌ఖేడా నకా పంచాయితీలో సర్పంచ్‌, కార్యదర్శి కలిసి బాలీవుడ్‌ హీరోయిన్లు దీపికా పడుకోన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఫోటోలతో పథకం లబ్ధిదారుల పేరిట నకిలీ జాబ్‌ కార్డులు సృష్టించి సొమ్ము చేసుకున్నారు. ఆయా ఖాతాల నుంచి డబ్బు తీసుకునేందుకు నకిలీ జాబ్‌ కార్డులను ఉపయోగించారు. మోనూ దూబే జాబ్‌ కార్డుపై దీపికా పడుకోన్‌ ఫోటోను ఉపయోగించారు. మోనూ దూబే పనికి వెళ్లకపోయినా ఆయన పేరుతో నకిలీ జాబ్‌ కార్డు ఉపయోగించి 30 వేల రూపాయలను డ్రా చేశారు.
ప్రతినెలా ఈ నిర్వాకం యదేచ్ఛగా సాగించారు. ఇక సోను అనే మరో లబ్ధిదారు పేరిట జాబ్‌ కార్డుపై జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఫోటో ఉపయోగించారు. ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము నిజమైన లబ్ధిదారులకు చేరకపోవడంతో అక్రమ వ్యవహారం గుట్టు రట్టయింది. జాతీయ ఉపాథి హామీ పథకం కింద తమకు ఎలాంటి పనులు రాకపోయినా సర్పంచ్‌, కార్యదర్శి, ఉపాథి హామీ అసిస్టెంట్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని కార్మికులు వాపోయారు. నకిలీ జాబ్‌ కార్డులు సృష్టించి ఆయా ఖాతాల నుంచి సొమ్మును మాయం చేసిన ఘటనపై జిల్లా పంచాయితీ సీఈవో గౌరవ్‌ బెనల్‌ విచారణకు ఆదేశించారు.

చదవండి : ఒంటరి మహిళపై సామూహిక లైంగిక దాడి

మరిన్ని వార్తలు