నాపై ఎప్పుడైనా దాడి జరగొచ్చు: దీపిక

21 Oct, 2020 21:07 IST|Sakshi

శ్రీనగర్‌: లాయర్‌ దీపికా రజావత్.. సంచలనాలకు మారుపేరు. ట్రోలింగ్‌ బారిన పడటం ఆమెకు కొత్తేమీ కాదు. రెండేళ్ల కిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా చిన్నారి అత్యాచారం, హత్య కేసులో బాధితుల తరఫున నిలబడ్డారు. ఈ కారణంగా అత్యాచార బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పోరాడారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో బాధిత కుటుంబమే, దీపిక సేవలు తమకు వద్దని చెప్పడంతో కేసు నుంచి ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ బాధితుల తరఫున తన గళం వినిపిస్తూ సామాజిక కార్యకర్తగా తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా ఆమె మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. (చదవండి: దళిత యువతి మృత్యు ఘోషకు భయపడే..)

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ప్రతిబింబించేలా ఉన్న ఓ కార్టూన్‌ను మంగళవారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఓవైపు దేవతామూర్తులను కొలుస్తూనే, మరోవైపు ఆదిశక్తి స్వరూపాలైన అతివలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతో రూపొందించిన కార్టూన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు చేసినందుకు ఆమెను అరెస్టు చేయాలంటూ నెటిజన్లు ట్రోల్‌ చేశారు. తమ మనోభావాలు గాయపరిచిన దీపికా రజావత్‌ను వెంటనే శిక్షించాలంటూ డిమాండ్‌ చేస్తూ #Arrest_Deepika_Rajawat అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేశారు. (‘ఏదో ఒకరోజు.. వాళ్లు నన్ను కచ్చితంగా చంపేస్తారు’)

అంతేగాక మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు జమ్మూ కశ్మీర్‌లోని ఆమె ఇంటి ఎదుట నిరసనకు దిగారు.  ఈ విషయం గురించి సోషల్‌ మీడియాలో వెల్లడించిన దీపిక.. ‘‘అలర్ట్‌... మా ఇంటి ముందు ఓ సమూహం ధర్నాకు దిగింది. నాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో నాకు బెదిరింపులు వస్తున్నాయి. నాపై ఎప్పుడు, ఎలా దాడి జరుగుతుందో తెలియదు. కాబట్టి చట్టబద్ధ సంస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకుని నాకు రక్షణ కల్పించాలని మనవి’’అని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు