వైరల్‌: చిరుతకు ఝలక్‌ ఇచ్చిన జింక

4 Jan, 2021 11:54 IST|Sakshi
వీడియో దృశ్యాలు

చిరుతకు తన వేగమే ఆయుధం అన్న సంగతి తెలిసిన విషయమే! కానీ, అది అన్ని సందర్భాలలో కాదు. కొన్ని సార్లు వేగంతో కూడిన ఆవేశం కంటే సరైన సమయంలో తీసుకునే చిన్న ఆలోచన ప్రాణాలు రక్షిస్తుంది. ఇందుకు బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన ఈ వీడియో నిదర్శనం. వీడియోలో.. ఓ జింక నీటి కుంట దగ్గర నీళ్లు తాగుతోంది. జింకను చూసిన ఓ చిరుత అత్యంత వేగంగా దాని వైపు దూసుకువచ్చింది. దీంతో ఉలిక్కిపడ్డ జింక వెనక్కు పరిగెడుతున్నట్లుగా పరిగెత్తి ఆవెంటనే యూటర్న్‌ తీసుకుని ముందుకు దూసుకెళ్లింది. ( నువ్వు కొరికితే నేను కూడా కొరుకుతా )

అతి ఆవేశం, వేగంతో ఉన్న చిరుత జింక చర్యకు కంగుతింది. నియంత్రణ కోల్పోయి సర్రున ముందుకు దూసుకుపోయింది. జింక ప్రాణాలతో అక్కడినుంచి తప్పించుకుపోయింది. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 2 లక్షల వ్యూస్‌, 12 వేల లైకులు, 1200 రీట్వీట్లు సొంత చేసుకుంది.  దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు... ‘‘ జింక తెలివిగా తప్పించుకుంది.. అద్భుతం... వేగమే చిరుత కొంపముంచింది... చిరుత దుమ్మ లేపింది.. జింక తెలివి చూపింది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు