8వేల కోట్ల ఆయుధాల కొనుగోలుకు ఓకే

3 Nov, 2021 05:26 IST|Sakshi

న్యూఢిల్లీ: దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, సైనిక సంబంధ ఆయుధాలు, పరికరాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఆయుధాల సమీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీలో జరిగిన రక్షణ ఆయుధాలు, ఉపకరణాల కొనుగోలు మండలి(డీఏసీ) సమావేశంలో ఆమోదం పొందాయని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

సైన్యం అవసరాల కోసం హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నుంచి 12 హెలికాప్టర్లను, నావికా దళం కోసం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ నుంచి లైనెక్స్‌ నావల్‌ గన్‌ఫైర్‌ నియంత్రణ వ్యవస్థను కొనుగోలుచేయనున్నారు. నావికాదళ గస్తీ విమానాలైన డార్నియర్‌ ఎయిర్‌క్రాప్ట్‌లను హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌తో అప్‌గ్రేడ్‌ చేయించాలని డీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ‘‘స్వావలంభనతోనే ఆయుధాల సమీకరణలో ‘ఆత్మనిర్భర్‌’ సాధించే దిశగా ముందడుగు వేయాలని నిర్ణయించారు.

ఇందులోభాగంగానే విదేశాల నుంచి నావికాదళ గన్స్‌ కొనుగోళ్లను అర్ధంతరంగా ఆపేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(భెల్‌) నుంచి అప్‌గ్రేడెడ్‌ సూపర్‌ ర్యాపిడ్‌ గన్‌ మౌంట్‌(ఎస్‌ఆర్‌జీఎం)లను తెప్పించాలని సమావేశంలో నిర్ణయించారు’’ అని రక్షణశాఖ ప్రకటనలో పేర్కొంది. యుద్ధనౌక ముందుభాగంలో ఠీవీగా కనబడే ఎస్‌ఆర్‌జీఎంతో ఎదురుగా ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో చేధించవచ్చు.

రూ.7,965 కోట్ల విలువైన ఆయుధసంపత్తి కొనుగోలు ప్రధానాంశంగా జరిగిన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. త్రివిధ దళాల అత్యవసరాలు, నిర్వహణ, ఆధునీకరణ, నిధుల కేటాయింపుల అంశాలను సమావేశంలో చర్చించారు. సైన్యం అవసరాల కోసం సమకూర్చుకోనున్న ఆయుధాలు, ఉపకరణాల డిజైన్, ఆధునికీకరణ, తయారీ మొత్తం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ స్ఫూర్తితో కొనసాగాలని సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల కాలంలో తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికులతో ఘర్షణల తర్వాత భారత సైన్యం కోసం అధునాతన ఆయుధాల సమీకరణ జరిగింది.

మరిన్ని వార్తలు