ఐశ్వర్యది ప్రభుత్వ హత్యే!

10 Nov, 2020 08:23 IST|Sakshi
సోమవారం ఢిల్లీలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన. ఇన్‌సెట్లో ఐశ్వర్య (ఫైల్‌)

ఢిల్లీలో విద్యార్థి సంఘాల నిరసన 

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ సంతాపం

ఆర్థిక ఇబ్బందులే ఐశ్వర్య ఆత్మహత్యకు కారణం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన విద్యార్థిని ఐశ్వర్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని లేడీ శ్రీరాం కళాశాల (ఎల్‌ఎస్‌ఆర్‌ ) స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ఆరోపించింది. కళాశాల ఉదాసీన వైఖరి సరికాదని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 3న ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి నిరసనగా కేంద్ర సైన్స్, టెక్నాలజీ కార్యాలయం ముందు ఎస్‌ఎఫ్‌ఐ, జేఎన్‌యూ విద్యార్థి నేతలు ధర్నా నిర్వహించారు.జేఎన్‌యూ స్టూడెంట్‌ యూనియన్, నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ), తెలుగు స్టూడెంట్‌ అసోసియేషన్‌ (టీఎస్‌ఏ), ఐద్వా–ఢిల్లీలు కూడా నిరసన గళం వినిపించాయి.

జస్టిస్‌ ఫర్‌ ఐశ్వర్య నినాదంతో ఆందోళన చేశారు. ‘కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వైఫల్యం కారణంగా అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఉపకార వేతనం ఆలస్యం కావడం వల్లే ఐశ్వర్య ఆర్థిక ఒత్తిడికి గురైంది. కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి రాజీనామా చేయాలి. ఐశ్వర్య కుటుంబానికి ప్రభుత్వం పరిహారమివ్వాలి. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు తరగతులు బహిష్కరి స్తున్నాం’ అని ఎస్‌ఎఫ్‌ఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 

‘ఐశ్వర్యకు చెల్లించాల్సిన ఉపకార వేతనంతో పాటు అదనంగా కొంత మొత్తాన్ని బాధిత కుటుం బానికి అందజేయాలి. విద్యార్థులందరి ఖాతా ల్లోనూ తక్షణమే ఉపకార వేతనాలు జమచేయాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులకు మద్దతుగా కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని ఐద్వా ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు మెమూనా మొల్లా, ఆశాశర్మ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ విద్యా విధానం బాగా సాగుతోందని కేంద్రమంత్రి భావిస్తున్నారని, కానీ విద్యార్థుల ఇబ్బందులు విస్మరిస్తున్నారని జేఎన్‌యూ ప్రతిని«ధులు పేర్కొన్నారు. 

‘రాష్ట్రేతర వర్సిటీలు, విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానం తీసుకురావాలి. వేరే ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడమే ఐశ్వర్య ఆత్మహత్యకు కారణం. ఢిల్లీలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఐశ్వర్య కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి. ఐశ్వర్య చెల్లెల్ని ప్రభుత్వమే చదివించాలి’ అని టీఎస్‌ఏ ప్రతినిధి వివేక్‌ తెలిపారు. 

ఎల్‌ఎస్‌ఆర్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఉన్నిమాయ, ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ సంయుక్త కార్యదర్శి మౌనిక శ్రీసాయి, జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్, అంబేడ్కర్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌ యూనియన్‌ కౌన్సిలర్‌ నవీన లాంబా, ఎస్‌ఎఫ్‌ఐ ఆల్‌ ఇండియా సంయుక్త కార్యదర్శి దీప్సిత ధర్, ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి, ఏపీ బాధ్యురాలు బూస అనులేఖ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. కాగా, కేంద్ర విద్యా మంత్రి పోఖ్రియాల్‌ నివాసం వద్ద ఎన్‌ఎస్‌యూఐ, తెలుగు స్టూడెంట్‌ అసోసియేషన్‌ కార్యకర్తలు ఆందోళన చేయడానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్యక్రమాన్ని విరమించారు. 

ఒత్తిడికి లోనై....
ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ విభాగం నిర్వహించిన వెబ్‌ మీడియా సమావేశంలో ఐశ్వర్య తల్లి మాట్లాడారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికి వచ్చిన ఐశ్వర్యకు వసతి గృహం ఖాళీ చేయాలని ఇటీవల సందేశం వచ్చిందన్నారు. మధ్యలో చదువు మానేస్తే నవ్వులపాలు అవుతామని తీవ్ర ఒత్తిడికి లోనయిందని చెప్పారు. ఉపకార వేతనం సకాలంలో అంది ఉంటే తమ కుమార్తె దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఐశ్వర్య మృతికి రాహుల్‌ సంతాపం
ఐశ్వర్వ ఆత్మహత్య పట్ల కాంగ్రెస్‌ ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు, లాక్‌డౌన్‌ వంటి నిర్ణయాలతో లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసిందని, ఇది
నిజమని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు