జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లే

25 Mar, 2022 04:52 IST|Sakshi

సీబీఐ వద్ద పెండింగ్‌లో 1,025 కేసులు

పార్లమెంట్‌ స్థాయీ సంఘం అసంతృప్తి  

న్యూఢిల్లీ:  కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వద్ద వెయ్యికి పైగా కేసులు పెండింగ్‌లో ఉండడం పట్ల పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందులో 66 కేసులు గత ఐదేళ్లకుపైగా పెండింగ్‌లోనే ఉండిపోవడం ఏమిటని ప్రశ్నించింది. న్యాయం చేకూర్చడంలో జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లేనని ఉద్ఘాటించింది. కేసుల విచారణను సుదీర్ఘకాలం కొనసాగించడం సరైంది కాదని పేర్కొంది. పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ఒక కచ్చితమైన రోడ్‌మ్యాప్‌ రూపొందించాలని సీబీఐకి సూచించింది.

ఈ మేరకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్‌కుమార్‌ మోదీ నేతృత్వంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం తాజాగా తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి 1,025 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు, ఇందులో 66 కేసులు ఐదేళ్లకుపైగా పెండింగ్‌ ఉన్నట్లు సీబీఐ లిఖితపూర్వకంగా తెలిపిందని నివేదికలో పేర్కొంది. పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించడానికి సీబీఐలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. డిప్యూటేషన్లపై ఆధారపడడం తగ్గించుకోవాలని,  స్వస్తి పలకాలని, కనీసం డీఎస్పీ స్థాయి వరకు అధికారులను శాశ్వత ప్రాతిపాదికన నియమించుకొనేందుకు చర్యలు తీసుకోవాలని సీబీఐకి పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. 

మరిన్ని వార్తలు