బొగ్గు కొరత, విద్యుత్‌ కోతలపై కేంద్ర హోంమత్రి అమిత్‌ షా సమీక్ష

11 Oct, 2021 17:13 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బొగ్గు సరఫరా సరిపోని కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఏర్పడుతుందని అనేక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖల ఇన్‌ఛార్జిగా ఉన్న మంత్రివర్గ సహచరులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సీనియర్ బ్యూరోక్రాట్లతో పాటు ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ అధికారులు హాజరయ్యారు. ఈ స‌మావేశంలో దేశంలోని విద్యుత్ ఉత్ప‌త్తికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, బొగ్గు ఉత్ప‌త్తికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.
చదవండి: ‘ఈతరం స్త్రీ పిల్లల్ని కనాలనుకోవడం లేదు’

కాగా దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు ఇతర నగరాల్లో తక్షణం ఏర్పడే విద్యుత్ అంతరాయం భయాలను తొలగించడానికి విద్యుత్ ప్లాంట్ల డిమాండ్‌ను తీర్చడానికి తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే విద్యుత్ అంతరాయాల గురించి అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నాయి. దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ప్రస్తుత ఇంధన నిల్వ దాదాపు 7.2 మిలియన్ టన్నులు ఉందని, నాలుగు రోజులకు సరిపోతాయని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని మైనింగ్ దిగ్గజం కోల్ ఇండియాలో 40 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వ ఉన్నాయని, ఇవి విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయం పూర్తిగా తప్పని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మరిన్ని వార్తలు