ఫేస్‌బుక్ ఇండియా ఎండీకి నోటీసులు

12 Sep, 2020 15:58 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.ఈ ఏడాది ఆరంభంలో చోటు చేసుకున్న ఢిల్లీ అల్లర్లలో ఫేస్‌బుక్‌కు పాత్ర ఉందంటూ, ఫేస్‌బుక్ ఇండియా అధికారులకు తాజా నోటీసులు జారీ  అయ్యాయి. ద్వేషపూరిత  కంటెంట్ పై చర్య తీసుకోవడంలో విఫలమైందంటూ ఆరోపించిన ఢిల్లీ అసెంబ్లీ కమిటీ సెప్టెంబర్ 15 న ఢిల్లీ విధానసభ ముందు హాజరుకావాలని కోరుతూ నోటీసు జారీ చేసింది. తమ వాదనను వినిపించేందుకు సెప్టెంబర్ 15 మంగళవారం హాజరు కావాలని ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య పూర్వక కమిటీ,, ఫేస్‌బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ కు సమన్లు జారీ చేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీ  నేత,  రాజేంద్రనగర్ చెందిన ఎమ్మెల్యే రాఘవ చాదా నేతృత్వంలోని కమిటీ ఈ సమన్లు జారీ చేసింది.  ఆరోపణలపై  కొంతమంది సాక్షులను, సాక్ష్యాలను  పరిశీలించిన మీద ఈ సమన్లు జారీ చేశామని కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు తీవ్రతరం కావడానికి ఫేస్‌బుక్ కారణమైందని ఆగస్టు 31వ తేదీన జరిగిన రెండో విచారణలో కమిటీ నిర్ధారించింది. రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న ఫేస్ బుక్ మరోసారి  వివాదంలో పడింది.   ప్రధానంగా అధికార బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ సంస్థ వ్యవహరిస్తోందని,  హింసను ప్రేరేపించే విద్వేషపూరిత కంటెంట్ విషయంలో  పట్టీపట్టనట్టు  వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్లో ఇటీవల వచ్చిన ఆరోపణల మధ్య తాజా నోటీసులు జారీ అయ్యాయి. 

మరిన్ని వార్తలు