కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు, డిసెంబర్‌ 6న హాజరవ్వాల్సిందే!

26 Nov, 2021 08:42 IST|Sakshi

డిసెంబర్‌ 6న హాజరై ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుపై వివరణ ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభకు చెందిన ‘శాంతి, సామరస్యం కమిటీ’ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు సమన్లు జారీ చేసింది. సోషల్‌ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆక్షేపించింది. డిసెంబర్‌ 6న మధ్యాహ్నం 12 గంటలకు తమ ముందు హాజరై, వివరణ ఇవ్వాలని కంగనాను ఆదేశించినట్లు కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రాఘవ్‌ చద్ధా ఒక ప్రకటనలో వెల్లడించారు.

నవంబర్‌ 20న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఓ పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. సిక్కు మతస్థులను ఖలిస్తాన్‌ ఉగ్రవాదులుగా కంగన అభివర్ణించినట్లు ఫిర్యాదుదారులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. అలాంటి పోస్టులు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తాయని, ఓ వర్గం ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తాయని రాఘవ్‌ చద్ధా పేర్కొన్నారు. శాంతి, సామరస్యం కమిటీని ఢిల్లీ అసెంబ్లీ 2020లో ఏర్పాటు చేసుకుంది. ఢిల్లీలో కొన్ని నెలల క్రితం జరిగిన అల్లర్లకు సంబంధించిన ఫిర్యాదులపై ఈ కమిటీ విచారణ జరుపుతోంది.  
 

మరిన్ని వార్తలు