ఢిల్లీ: ఆదిత్య–మాధురీల పెళ్లి గురించి విన్నారా?

2 Apr, 2021 08:35 IST|Sakshi

పెళ్లి పుస్తకం.. పర్యావరణహితం..

పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలు.. అంతేనా.. ఇంకా చాలా.. వెడ్డింగ్‌ ప్లానర్లు.. డెస్టినేషన్‌ వెడ్డింగులు.. ఇలాంటివి కొన్ని విన్నాం.. కొన్ని చూశాం కూడా.. మరి.. ఢిల్లీలో జరిగిన ఆదిత్య–మాధురీల పెళ్లి గురించి విన్నారా? ఎలా జరిగిందో చూశారా?  వీరు చాలా వినూత్నంగా చేసుకున్న ఎకో ఫ్రెండ్లీ పెళ్లి గురించి జాతీయ పత్రికలు సైతం రాశాయి.. ఎందుకంటే.. అందరిలా ఆదిత్య అగర్వాల్‌(32) పెళ్లి మండపానికి భారీ బారాత్‌తో గుర్రమెక్కి రాలేదు.. తనే కాదు.. అతని ఫ్రెండ్స్‌ కూడా ఇదిగో ఇలా చిన్నపాటి ఎలక్ట్రిక్‌ బైక్‌ల మీద వచ్చారు.. అది కూడా రెంట్‌కు తీసుకుని.. ఇక మాధురి బంధువుల ఇంట్లోనే పెళ్లి వేదిక ఏర్పాటు చేశారు.

బయట పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టలేదు.. స్కూళ్లో వాడే బ్లాక్‌బోర్డుపై చాక్‌పీసుతో ఆదిత్య వెడ్స్‌ మాధురి అని రాశారు. ఎక్కడా ప్లాస్టిక్‌ అన్నది వాడకుండా.. మండపం డెకరేషన్‌ కూడా పాత సీసాలు, వార్తాపత్రికలతో చేసేశారు.. భారీ దండలకు బదులు తులసిమాలలు వేసుకున్నారు. అది కూడా ఎందుకో తెలుసా? ఎండిపోయిన తర్వా త టీ పౌడర్‌లా వాడుకోవడానికట! ఇక కట్నం సంగతి.. రెండు కుటుంబాల వాళ్లు ఒక కిలో పండ్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అదే కట్నం!! శుభలేఖలు ముద్రించనేలేదు.. అంతా ఆన్‌లైన్‌ పిలుపులే. వచ్చినోళ్లు కూడా ఎకోఫ్రెండ్లీ బహుమతులు ఇవ్వగా.. వాటిని కూడా కాగితంలో చుట్టి తెచ్చారట. ఈ ఎకోఫ్రెండ్లీ పెళ్లి ఐడియా మాధురీదే.. తన తల్లి రీసైక్లింగ్‌కు సంబంధించిన ఉద్యోగంలో ఉన్నారట.. దాంతో అదే స్ఫూర్తితో కేవలం రూ.2 లక్షల ఖర్చుతో మొత్తం పెళ్లి కానిచ్చేశారు.

మరిన్ని వార్తలు