ఏం చేయలేం: వ్యాక్సిన్‌పై చేతులెత్తేసిన ఢిల్లీ

11 May, 2021 19:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కరోనా వ్యాప్తి చెందడానికి కూడా అదొక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశంలో రెండు రకాల వ్యాక్సిన్‌లు దేశంలో వేస్తున్నారు. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌లు అవసరానికి తగ్గట్టు సరఫరా లేదు. దీంతో వ్యాక్సిన్‌ ప్రక్రియపై ఢిల్లీ ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రస్తుతం ఒక్కరోజుకే వ్యాక్సిన్‌ నిల్వలు ఉన్నాయని.. 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ వేయలేమని ఢిల్లీ ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే 125 కేంద్రాల్లో కోవాగ్జిన్‌ టీకాలు 18-44 వయసు వారికి వేయడం నిలిపివేస్తున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి మంగళవారం తెలిపారు. ‘ఒక్క రోజుకు మాత్రమే కోవాగ్జిన్‌ ఉంది’ అని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ సోమవారం ప్రకటన చేయగా మంగళవారం ఆ పార్టీ నాయకుడు వ్యాక్సిన్‌ కొరతతో ఆ ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇక కోవిషీల్డ్‌ మూడు, నాలుగు రోజులకు సరిపడా ఉందని ఆరోగ్య మంత్రి తెలిపారు.

కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ పంపాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశాం. పంపకపోతే ఇక ఏం చేస్తాం. వ్యాక్సిన్‌ ప్రక్రియను నిలిపివేస్తున్నాం’ అని అతిషి తెలిపారు. వ్యాక్సిన్‌ విషయంలో రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆ రాష్ట్ర మంత్రులు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. వ్యాక్సిన్‌ సరఫరా పెంచితే మూడు నెలల్లో పూర్తి చేస్తామని సీఎం కేజ్రీవాల్‌ తెలిపిన విషయం తెలిసిందే.

చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న యూట్యూబర్‌ ఆఖరి మాటలు

చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా

>
మరిన్ని వార్తలు