Covid: పసిబిడ్డ మృతి.. ఆస్పత్రిలో అంధ తల్లిదండ్రులు

14 May, 2021 21:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీలో చోటు చేసుకున్న విషాద ఘటన

న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని దిల్షద్‌ గార్డెన్‌ నివాసి అయిన శశాంక్‌‌ శేఖర్‌(26) పుట్టుకతోనే అంధుడు. అదే లోపం ఉన్న మరో మహిళతో కొన్నేళ్ల క్రితం అతడికి వివాహం జరగింది. ఈ అంధ దంపతులు జీవితంలో వెలుగులా వచ్చాడు క్రిషు. అంధులైనప్పటిక బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. బిడ్డ బోసి నవ్వు వారి జీవితాల్లో వెలుగులు నింపింది. అయితే వారు సంతోషంగా ఉండటం చూసి విధికి కూడా కన్ను కుట్టింది. మహమ్మారి రూపంలో ఆ కుటుంబాన్ని వెంటాడింది. తొమ్మిది నెలల పసికందు క్రిషు కోవిడ్‌ సోకి మృత్యువాత పడ్డాడు. ఈ విషయం పాపం ఆ అంధ తల్లిదండ్రులకు తెలియదు. ఎందుకంటే వారు కూడా ఆస్పత్రిలో కోవిడ్‌తో పోరాడుతున్నారు. ఈ కన్నీటి వ్యధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. 

18 రోజుల క్రితం శశాంక్‌ భార్యకు కోవిడ్‌ సోకింది. బిడ్డకు పాలిస్తుండటంతో ఆవిడ ద్వారా వైరస్‌ 9 నెలల పసికందు క్రిషుకు వ్యాపించింది. ఆ తర్వాత శశాంక్‌ కూడా కోవిడ్‌ బారిన పడ్డాడు. దాంతో బంధువులు వారిని ఆస్పత్రిలో చేర్పించారు. శశాంక్‌ పరిస్థితి విషమించడంతో అతడిని తాహీర్‌పూర్‌ రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. గురు తేఘ్‌ బహదూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి క్రిషు గురువారం మరణించాడు. 

చిన్నారి మరణ వార్త ఆ అందతల్లిదండ్రులకు తెలియదు. వారు తమ అనారోగ్యం గురించి కాకుండా బిడ్డకు ఎప్పుడు నయమవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక స్థానిక బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేందర్‌ సింగ్‌ అలియాస్‌ షంటి చిన్నారి క్రిషుకి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 2000 మంది కోవిడ్‌ మృతులకు అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నారు. 

చదవండి: Corona: పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవే..

మరిన్ని వార్తలు