హెలికాప్టర్‌ ప్రమాదం: ఢిల్లీకి పార్థివ దేహాలు

10 Dec, 2021 08:22 IST|Sakshi

నివాళులు అర్పించిన మోదీ 

నేడు రావత్‌ దంపతుల అంత్యక్రియలు

ఇంకా గుర్తించని మృతదేహాలు 10

న్యూఢిల్లీ: హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన జనరల్‌ రావత్‌ దంపతులతోపాటు ఇతరుల పార్థివ దేహాలను సైనిక విమానంలో గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్‌ బేస్‌కు తీసుకొచ్చారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఆర్మీ చీఫ్‌ నరవణే, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏవీఆర్‌ చౌదరి నివాళులర్పించారు. మృతుల కుటుంబీకులు హాజరయ్యారు. ఇక్కడ భావోద్వేగ వాతావరణం కనిపించింది. రావత్‌ ఇద్దరు కుమార్తెలను ప్రధాని మోదీ ఓదార్చారు. అంతకు ముందు తమిళనాడులోని వెల్లింగ్టన్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌ సెంటర్‌లో పార్థివ దేహాలకు తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ తమిళిసై, తమిళనాడు సీఎం స్టాలిన్‌ నివాళులర్పించారు. మృతదేహాలను కోయంబత్తూరుకు, తర్వాత ఢిల్లీకి తరలించారు. 

3 మృతదేహాల గుర్తింపు 
హెలికాప్టర్‌ ప్రమాదంలో 13 మంది మరణించగా, ఇప్పటివరకు 3 మృతదేహాలను గుర్తించారు. రావత్, ఆయన భార్య మధులిక, బ్రిగేడియర్‌ లఖ్వీందర్‌ సింగ్‌ లిడ్డర్‌ మృతదేహాలను గుర్తించామని, వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. మిగిలిన పార్థివ దేహాలను ఆర్మీ బేస్‌ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరుస్తామని చెప్పారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.

మృతదేహాలకు చాలావరకు కాలిపోయాయని, అందుకే గుర్తింపు ప్రక్రియ కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. రావత్‌ దంపతుల మృతదేహాలను శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఢిల్లీలోని 3 కామరాజ్‌ మార్గ్‌ నివాసంలో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకు బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.  

రాష్ట్రపతి కోవింద్‌కు రాజ్‌నాథ్‌ వివరణ
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదం గురించి తెలియజేశారు. ఈ దుర్ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. ఈ ప్రమాదంపై త్రివిధ దళాల విచారణకు భారత వైమానిక దళం ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు.


చదవండి: Tamil Nadu: 30 మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడిలోకి ఆర్టీసీ డ్రైవర్‌

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు