ముగిసిన కేజ్రీవాల్‌ సీబీఐ విచారణ.. ‘లిక్కర్‌ స్కామ్‌ అనేదే లేదు’

16 Apr, 2023 21:19 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో  కేజ్రీవాల్‌ను సుదీర్ఘంగా సీబీఐ అధికారులు విచారించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీబీఐ సుమారు 9గంటల పాటు విచారించింది.

అనంతరం, కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీబీఐ దాదాపు 9 గంటల పాటు నన్ను ప్రశ్నించింది. సీబీఐ అడిగిన 56 ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. మద్యం కుంభకోణంలో అన్ని తప్పుడు ఆరోపణలతో రాజకీయం చేస్తున్నారు. ఆప్ 'కత్తర్ ఇమాందార్ పార్టీ'. ఆప్‌ని అంతం చేయాలనుకుంటున్నారు. కానీ, దేశ ప్రజలు మాతోనే ఉన్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు లిక్కర్‌ స్కామ్‌ అనేది లేదన్నారు కేజ్రీవాల్‌. కావాలనే ఇదంతా చేస్తున్నారని కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఈ స్కామ్‌ అనేది కేవలం కల్పితం మాత్రమేనని కేజ్రీవాల్‌ అన్నారు.

అయితే, లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి సమాచారాన్ని సేకరించే క్రమంలో కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో సీఆర్‌పీసీ 161 కింద కేజ్రీవాల్‌ స్టేట్‌మెంట్‌ను సైతం రికార్డు చేశారు. లిఖితపూర్వకంగా కూడా స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు సీబీఐ అధికారులు. కాగా, విచారణ సందర్బంగా మద్యం పాలసీ రూపకల్పన, సౌత్‌గేట్‌కు ప్రయోజనంపై ఆరా తీసినట్టు సమాచారం. 

అంతకుముందు.. కేజ్రీవాల్‌ విచారణ నేపథ్యంలో సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద  అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,000 మంది పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంవైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్ విధించారు. సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, పంజాబ్ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరసనకు దిగారు.

మరిన్ని వార్తలు