భారతరత్న వాళ్లకే ఇవ్వడి.. ప్రధాని మోదీకి కేజ్రీవాల్‌ లేఖ

5 Jul, 2021 11:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వం ముందు సరికొత్త డిమాండ్‌ను ఉంచారు. కరోనాపై పోరాటంలో ముందు వరసలో నిలిచి ప్రజల ప్రాణాలు కాపాడిన భారతీయ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఈ ఏడాది భారతరత్న ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక లేఖ కూడా రాశాడు. 

వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందరికీ సమూహంగా భారత రత్న ఇవ్వాలని, అసరమైతే నిబంధనలు మార్పు చేయాలని కోరారు. ఈ ఏడాది భారతరత్నను వైద్యుడికి ఇవ్వాలని దేశం కోరుకుంటోందని అలా అని ఎవరో ఒకరికి ప్రకటించమని తాను కోరడం లేదన్నారు. దేశంలోని వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది అందరినీ కలిపి సముచిత గౌరవం కల్పించాలని కోరారు. ఈ విధంగా ప్రకటించడమే కరోనాతో పోరాడి మృతి చెందిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికిచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు.

చదవండి: ఉచిత విద్యుత్‌.. రోజంతా కరెంట్‌

లక్షలాది మంది వైద్య సిబ్బంది నిస్వార్థంగా సేవలందించారని, దేశం మొత్తం వైద్యులను కీర్తిస్తోందని, వారందరినీ భారతరత్నతో గౌరవిస్తే భారతీయులందరూ సంతోషిస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.  ఐఎంఏ లెక్కల ప్రకారం.. కరోనాతో ఇప్పటిదాకా 1,492 మంది వైద్యులు చనిపోగా.. కరోనా వారియర్లుగా వేల సంఖ్యలో మిగతా వైద్య సిబ్బంది మృత్యువాత పడ్డారు.

మరిన్ని వార్తలు