హవాలా కేసులో మంత్రి అరెస్ట్‌.. కేజ్రీవాల్‌ ఊహించినట్లే జరిగింది!

31 May, 2022 07:37 IST|Sakshi
సత్యేందర్‌ జైన్‌తో కేజ్రీవాల్‌ (ఫైల్‌ ఫొటో)

ఢిల్లీ: మనీల్యాండరింగ్‌ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌(57) అరెస్ట్‌ కావడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అరెస్ట్‌ను.. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓటమి భయంతోనే కేంద్రంలోని బీజేపీ చేయించిన అరెస్ట్‌గా ఆమ్‌ఆద్మీపార్టీ ఆరోపిస్తోంది. అయితే జైన్‌ అరెస్ట్‌ను ఢిల్లీ సీఎం ఏనాడో ఊహించారా?.. ఆయన ఏమన్నారంటే..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌ను అరెస్టు చేస్తారని జనవరిలోనే చేసిన అంచనా.. సోమవారం నిజమైంది. ఈ మేరకు ఓ ఈవెంట్‌కు హాజరైన కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లో అది పంజాబ్ ఎన్నికలకు ముందు, లేదంటే తర్వాతైనా సత్యేందర్‌ జైన్‌ను అరెస్టు చేసేందుకు ఈడీ వస్తున్నట్లు సమాచారం అందింది. కేంద్రం జైన్‌పై గతంలో రెండుసార్లు దాడులు చేసినా.. ఏమీ దొరకలేదు. ఇప్పుడు మళ్లీ రావాలనుకుంటే.. వాళ్లకు స్వాగతం. 

ఎన్నికల సీజన్ టైంలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంటుంది. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను మోహరిస్తుంటుంది. ఈ క్రమంలోనే దాడులు, అరెస్టులు జరుగుతుంటాయి. కానీ, మేం అరెస్టులకు భయపడం. ఇది కేంద్రం ఆడిస్తున్న డ్రామానే అని, ఆప్‌పై అవినీతి ముద్ర వేయించేందుకు చేస్తున్న ప్రయత్నం. ప్రజలకు అసలు విషయం అర్థం కావడానికి ఎంతో టైం పట్టదు అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే.. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) సత్యేందర్‌ జైన్‌కు ఝలక్ ఇచ్చింది. సోమవారం ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. రెండు నెలల కిందటే ఆయనకు, కుటుంబ సభ్యులకు సంబంధించిన 4.81 కోట్ల రూపాయల ఆస్తిని ఈడీ ఎటాచ్‌ చేసింది. కోల్‌కతా సంబంధించిన సంస్థల ద్వారా 2015-16 మధ్యకాలంలో హవాలా లావాదేవీలు నిర్వహించారని సత్యేంద్ర జైన్‌పై ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ను మనీలాండరింగ్ కేసులో సోమవారం అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య శాఖతో పాటు  పిడబ్ల్యూడీ, విద్యుత్ శాఖలను నిర్వహిస్తున్నారు.

చదవండి👉: సభలో సీఎం యోగితో నవ్వులు పూయించి! అంతలోనే..

మరిన్ని వార్తలు