గుజరాత్‌ నుంచి వైదొలగమని బీజేపీ ఆఫర్‌ ఇచ్చింది: కేజ్రీవాల్‌

5 Nov, 2022 14:21 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన  రోజుల వ్యవధిలోనే బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచి వైదొలగాలని బీజేపీ ఆఫర్‌ ఇచ్చినట్లు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలా చేస్తే విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రులు సత్యేంద్ర జైన్‌, మనీశ్‌ సిసోడియాలకు ఉపశమనం కల్పిస్తామని ఆఫర్‌ చేసినట్లు తెలిపారు. గుజరాత్‌ ఎన్నికల నుంచి తప్పుకుంటే సత్యేంద్ర జైన్‌ను జైలు నుంచి విడుదల చేస్తామని చెప్పిందని పేర్కొన్నారు.

‘ఢిల్లీలో ఎంసీడీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించటం ద్వారా కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నట్లు కనిపించటం లేదు. బీజేపీ భయపడుతున్నట్లు స్పష్టమవుతోంది. వారు రెండు ప్రాంతాల్లో గెలుస్తామనే ధీమాలో ఉంటే అలాంటి ఆలోచన అవసరం లేదు. నిజానికి గుజరాత్‌తో పాటు ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో రెండు చోట్లా ఓడపోతామని బీజేపీ భయపడుతోంది. అందుకే రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనుకుంటున్నారు. ఆప్‌ను వీడితే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న ఆఫర్‌ను మనీశ్‌ సిసోడియా తిరస్కరించిన తర్వాత వారు నన్ను సంప్రదించారు. గుజరాత్‌ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటే.. సత్యేంద్ర జైన్‌, సిసోడియాలపై ఉన్న అన్ని కేసులను తొలగిస్తామని ఆఫర్‌ చేశారు.’ అని సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్‌. అయితే, ఎవరు ఆఫర్‌ చేసారనే ప్రశ్నకు.. బీజేపీ నేరుగా ఎప్పుడూ సంప్రదించదని, సొంత పార్టీ నేతల ద్వారానే వచ్చినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ఉపఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

మరిన్ని వార్తలు