Air India Urination Case: విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తికి బెయిల్..

31 Jan, 2023 19:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం తీర్పు రిజర్వు చేసిన న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పునిచ్చింది. ఢిల్లీ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన సాక్షి చెప్పిన దానికి, ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన దానికి పొంతన లేదని పాటియాలా కోర్టు చెప్పింది. సాక్ష‍్యాధారాలు సరిగ్గా లేనందున నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.

శంకర్ మిశ్రాకు బెయిల్ ఇవ్వొద్దని అతను చేసిన పని వల్ల అంతర్జాతీయంగా భారత్ అపఖ్యాతి పాలైందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే అది వేరే విషయమని చట్టపరమైన విషయాలు మాత్రమే పరిశీలించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

గతేడాది నవంబర్ 26న న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో అశోక్ మిశ్రా వికృత చేష్టలు చేశాడు. ఫుల్లుగా తాగి మహిళపై మూత్ర విసర్జన చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 11న మెజిస్టేరియల్ కోర్టు శంకర్ మిశ్రాకు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే పాటియాలా కోర్టు మాత్రం బెయిల్ మంజూరు చేసింది.

ఈ వ్యవహారంలో ఎయిర్ ఇండియా యాజమాన్యానికి రూ.30లక్షల జరిమానా కూడా విధించింది కేంద్ర పౌరవిమానయాన శాఖ. విమానం పైలట్ ఇంఛార్జ్‌ను కూడా మూడు నెలలు సస్పెండ్ చేసింది. ఎయిర్ ఇండియా విమాన సేవల డైరెక్టర్‌కు రూ.3లక్షల పెనాల్టీ విధించింది.
చదవండి: అత్యాచార కేసులో సెషన్స్‌ కోర్టు కీలక తీర్పు.. ఆశారాం బాపునకు జీవిత ఖైదు

మరిన్ని వార్తలు