-

స్మృతి ఇరానీ కూతురు బార్‌ కేసులో ట్విస్ట్‌.. కాంగ్రెస్‌ నేతలకు షాక్‌

29 Jul, 2022 13:44 IST|Sakshi

Smriti Irani Defamation Case.. గోవాలో బార్‌ వ్యవహారంలో దేశంలో హాట్‌ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్ర‌మంగా బార్ నిర్వ‌హిస్తోంద‌ని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్‌ వేదికగా పోస్టు చేశారు. 

అయితే, కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు నిరాధారమైనవని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతలపై కేంద్ర మంత్రి పరువు నష్టం దావా వేశారు. కాగా, శుక్రవారం ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్‌ నేతలకు భారీ షాకిచ్చింది. ముగ్గురు హస్తం నేతలు జైరాం ర‌మేశ్‌, ప‌వ‌న్ ఖేరా, నెత్తా డిసౌజాల‌కు నోటీసులు జారీ చేసింది. ప‌రువున‌ష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేత‌లు ఆగ‌స్టు 18వ తేదీన కోర్టు ముందు హాజ‌రుకావాలని కోర్టు ఆదేశించింది. అలాగే, గోవాలో బార్‌ సంబంధించి చేసిన ట్వీట్లను 24 గంట‌ల్లోగా డిలీట్ చేయాల‌ని కోర్టు తెలిపింది. 

ఈ క్రమంలో కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. జైరాం రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్మృతి ఇరానీ వేసిన దావాను కోర్టులోనే ఛాలెంజ్ చేస్తామ‌ని కౌంటర్‌ ఇచ్చారు. అసలు వాస్తవాలను కోర్టుకు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. గోవాలో బార్ల విషయంలో త‌న కూతురుపై ఆరోప‌ణ‌లను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ విషయాన్ని లీగల్‌ నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. అలాగే, రెండు కోట్ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని మంత్రి స్మృతి ఇరానీ త‌న ప‌రువు న‌ష్టం దావాలో డిమాండ్ చేశారు. 

ఇది కూడా చదవండి: బెంగాల్‌ స్కామ్‌.. నటి అర్పితా ముఖర్జీ కేసులో ఊహిం‍చని పరిణామం

మరిన్ని వార్తలు