నేరస్థుల వెన్నులో వణుకు.. చట్టాలను పాటించే ప్రజలకు భద్రత..!

8 Aug, 2021 17:46 IST|Sakshi

దేశ సరిహద్దుల్లో సైనికులు, దేశం లోపల పోలీసులు ఉన్నారనే ధైర్యంతోనే దేశ ప్రజలు సుఖంగా నిద్రపోగలుగుతున్నారు. ప్రతి వ్యవస్థలో అవినీతి అధికారులు ఉన్నట్లే.. పోలీసు శాఖలో కూడా కొన్ని అవినీతి కలుపు మొక్కలు ఉండవచ్చు. అంత మాత్రం చేత వ్యవస్థ మొత్తాన్ని శంకించాల్సిన అవసరం లేదు. పల్లె, పట్టణం, నగరం.. ఇలా పేరేదైనా పోలీసుల నిరంతర నిఘా ప్రజలకు భరోసానిస్తుంది.  

సాక్షి, న్యూఢిల్లీ: పోలీసులంటే నేరస్థులకు భయం, చట్టాన్ని పాటించే పౌరులకు భద్రతా భావం కలిగేలా ఉండాలని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ ఆస్తానా ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. తీవ్రమైన నేరాలు జరిగితే జిల్లా డీసీపీలు తప్పనిసరిగా నేర ప్రాంతాన్ని సందర్శించాలని ఆయన ఆదేశించారు. చైన్ స్నాచింగ్, దోపిడీల వంటి పట్టణ నేరాలను నిరోధించడానికి వీధుల్లో పోలీసుల నిరంతర నిఘా ఉండాలని సీపీ కోరారు.

కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయాలు
ఢిల్లీ సీపీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే రాకేశ్‌ ఆస్తానా కీలక నిర్ణయాలు చేపడుతున్నారు. ఉన్నత స్థాయి ర్యాంకు అధికారులతో నేరాలకు అదుపు చేయడానికి మీటింగ్‌లను నిర్వహిస్తున్నారు. లా అండ్‌ ఆర్డర్‌ను విభజించి నేర పరిశోధనకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగా పోలీసు అధికారులకు నిర్దిష్ట పనులు అప్పగించన్నుట్లు సమాచారం. టాస్క్‌ల ఆధారంగా పోలీసులు ఒంటరిగా ఉండవద్దని సూచిస్తున్నారు. 

అనవసరంగా తప్పులు వెతుకొద్దు..!
వివిధ ప్రదేశాల్లో డ్యూటీని నిర్వర్తించడానికి ఏ పోలీసు వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావద్దని, సీనియర్ అధికారులు మార్గదర్శకులుగా ఉండి ఫోర్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. అనవసరంగా వారి వద్ద తప్పులు వెతకవద్దని కోరారు. 14,000 మంది పోలీసు సిబ్బంది హాజరైన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పోలీసులు పెట్రోలింగ్‌ సమయంలో అనేక సాంకేతిక కార్యక్రామాలను చేపట్టారని అన్నారు. సాక్ష్యం, శాస్ట్రీయ దర్యాప్తు ఆధారంగా నిందితులను దోషులుగా నిర్థారిస్తారని అన్నారు. ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్లలో మూడు డ్యూటీ షిఫ్ట్‌లు కూడా పైలట్ ప్రాతిపదికన ప్రారంభమవుతాయని సీపీ సూచించారు.

మర్యాదగా, సహానుభూతితో వ్యవహరించాలి
వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులు, ఆటో డ్రైవర్లు, రిక్షావాలా మొదలైన వారి సహకారంతో ఢిల్లీ పోలీసులు తీవ్రవాద కార్యకలాపాలను, నేరాలకు ప్రణాళికలు రచించే వారిని గుర్తించాలని అన్నారు. ఫిర్యాదుదారులు, బాధితులు, పోలీస్ స్టేషన్లకు వచ్చే సందర్శకులకు తగినంత సమయం ఇచ్చి, శ్రద్ధ చూపాలని అన్నారు. వారితో మర్యాదగా, సహానుభూతితో వ్యవహరించాలని ఆస్తానా ఎస్‌హెచ్‌ఓలకు చెప్పారు.

నగరానికి వచ్చే సందర్శకులు తమ మొదటి అభిప్రాయాన్ని ట్రాఫిక్ సిబ్బంది వలనే పొందుతారని, అందువల్ల ఢిల్లీ పోలీసులపై సరియైన అభిప్రాయాన్ని కలిగించే బాధ్యత ట్రాఫిక్ విభాగానికి ఉందని ఆయన అన్నారు. ఇక స్వాతంత్ర్యదినోత్సవం కోసం ఎర్రకోట వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట వద్ద ఎవరూ ఆందోళనలు చేయకుండా.. పెద్ద పెద్ద కంటైయినర్లను గోడలుగా ఏర్పాటు  చేస్తున్నారు. జమ్మూ ఎయిర్‌బేస్‌పై ఇటీవలి డ్రోన్ దాడి నేపథ్యంలో.. భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు