జీ20 సమ్మిట్‌: ఉక్రెయిన్ యుద్ధంపై ఏమని తీర్మానించారంటే..

9 Sep, 2023 18:48 IST|Sakshi

ఢిల్లీ: ఉక్రెయిన్‌లో శాశ్వతమైన శాంతి నెలకొనాలనే తీర్మానాన్ని జీ20 సమ్మిట్ ఆమోదించింది. ప్రస్తుత కాలం యుద్ధాల యుగం కాదని రష్యా పేరు ఎత్తకుండానే సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇతర దేశాల భూభాగాల దురాక్రమణ, అణ్వాయుధాల ముప్పు ఉండకూడదని సభ్య దేశాలు కోరాయి.

ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి సభ్య దేశాలు ఇండోనేషియా బాలీలో జరిగిన తీర్మానాన్ని పునరుద్ఘాచించాయి. ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రపంచ దేశాలు నడుచుకోవాలని పిలుపునిచ్చాయి. అణ్వాయుధ ప్రయోగాల ముప్పు ఉండకూడదని కోరాయి. 

జీ20 ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి వేదిక. ‍అయినప్పటికీ ఆర్ధిక వ్యవస్థల్ని దెబ్బతీసే పర్యావరణ, భౌగోళిక, రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తారు. వాటిని ఎదుర్కొనడానికి తీర్మానాలను రూపొందించి ఆమోదం తెలుపుతారు. 

ప్రస్తుతం ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్నే ప్రధానంగా చర్చించారు. ప్రపంచ ఆహార, ఇందన భద్రత, సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణంపై యుద్ధం ప్రభావం చూపుతోందని తీర్మానించారు. కరోనా సృష్టించిన ఆర్థిక విపత్తు నుంచి కోలుకుంటున్న దేశాలను ఉక్రెయిన్ యుద్ధం కష్టకాలంలోకి  నెట్టేసిందని అభిప్రాయపడ్డారు. 

రష్యా, ఉక్రెయిన్‌ నుంచి ముడి పదార్థాలను ఎటువంటి అడ్డుంకులు లేకుండా సరఫరా చేయాలని జీ20 సమ్మిట్ పిలుపునిచ్చింది. సంక్షోభాలకు శాంతియుత పరిష్కారాలు,  దౌత్యం, చర్చలు చాలా ముఖ్యమైనవని ఈ డిక్లరేషన్‌ అభిప్రాయపడింది.

ఇదీ చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే..

మరిన్ని వార్తలు