ఢిల్లీకి ‘ఊపిరి’: ఆక్సిజన్‌పై కీలక ప్రకటన

13 May, 2021 14:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీ ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా మహమ్మారి విజృంభణ కొంత తగ్గుముఖం పట్టగా.. ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ అవుతున్నాయి. ఆక్సిజన్ డిమాండ్ కూడా తగ్గింది. ఈ సందర్భంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ఆక్సిజన్‌ డిమాండ్‌ తగ్గింది. మిగులు ఆక్సిజన్‌ను అవసరమైన ఇతర రాష్ట్రాలకు ఇచ్చుకోవచ్చు. కరోనా వైరస్ కేసులలో తగ్గుదల వచ్చింది. ఆసుపత్రి పడకలు ఖాళీ అవుతున్నాయి. కోవిడ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో (15 రోజుల కిందట) మాకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమైంది. పడకల ప్రకారం ఢిల్లీ ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 582 మెట్రిక్ టన్నులకు పడిపోయింది."

"మేం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాం.  రోజుకు 582 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో మా పని జరుగుతోందని, ఢిల్లీ కోటా నుంచి మిగులు ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు ఇవ్వండి అని విన్నవించాం" అని సిసోడియా చెప్పారు. మహమ్మారి రెండో దశలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వారు బాధలో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రజల సహాయానికి వచ్చినందుకు కేంద్రానికి, ఢిల్లీ హైకోర్టుకు ఈ సందర్భంగా సిసోడియా కృతజ్ఞతలు తెలిపారు.

తాజాగా ఢిల్లీలో ఒక్క రోజులో కొత్తగా 10,400 కేసులు నమోదయ్యాయి. ఇవి గతానికి కంటే చాలా తక్కువ. ‘నిన్నటి గణాంకాల కంటే 21 శాతం తక్కువ. పాజిటివిటీ రేటు 14 శాతానికి పడిపోయింది’ అని సిసోడియా వెల్లడించారు. కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అమలు చేయడంతో ఇది సాధ్యమైందని సిసోడియా తెలిపారు. కరోనా చైన్‌ తెంపేందుకు ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్‌, తీవ్ర ఆంక్షలతో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి కొంత అదుపులోకి వస్తోంది.

చదవండి: ‘కోవిషీల్డ్’ డోసుల వ్యవధిలో కీలక మార్పులు
చదవండి: కంగారొద్దు.. రెమిడిసివిర్‌ కొరత లేదు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు