ప్రభుత్వ నిర్ణయంతో వణికిపోతున్న టీచర్లు!

20 Nov, 2020 14:50 IST|Sakshi

న్యూఢిల్లీ: అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వ నిర్ణయంతో ఢిల్లీలోని ప్రైమరీ స్కూళ్ల టీచర్లు వణికిపోతున్నారు. కరోనాకు నెలవైన ప్రాంతాల్లో సర్వే విధులు నిర్వర్తించాలని సర్కార్‌ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. కోవిడ్‌ కేసులతో హాట్‌స్పాట్లు ఉన్న చోట పీపీఈ కిట్లు కూడా లేకుండా ఎలా పనిచేస్తామని వాపోతున్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో తగ్గినట్టే కనిపించిన కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఇంటింటి సర్వే చేసి బాధితుల వివరాలు కనుక్కొని వృద్ధులు, గర్భిణీ మహిళలకు సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వం భావించింది. నిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా ప్రజల్లో అవగాహన పెంచనుంది. దానికోసం 9525 బృందాలని ఏర్పాటు చేసింది. 
(చదవండి: మళ్లీ మహమ్మారి విజృంభణ)

ఒక్కో బృందంలో ఒక ప్రైమరీ టీచర్‌/బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌, ఒక నర్స్‌, ఒక పోలీస్‌ సిబ్బంది ఉంటారు. ఐదు రోజులపాటు సాగనున్న ఈ సర్వే నేడు ప్రారంభమైంది. ప్రతి బృందం రోజుకు 30 ఇళ్లను సర్వే చేయాల్సి ఉంటుంది. ప్రతి 10 లేక 15 బృందాలకు ఒక టీజీటీ/పీజీటీ టీచర్‌ పర్యవేక్షకుడిగా ఉంటారు. ‘నవంబర్‌ 19 రాత్రి 10.30 గంటలను నా మొబైల్‌ నెంబర్‌ను కోవిడ్‌-19 సర్వే డ్యూటీ 2020 అనే వాట్సాప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేశారు. రేపటి నుంచి ఫలానా హాట్‌స్పాట్‌ ప్రాంతంలో విధులు నిర్వహించాలని వాట్సాప్‌ మెసేజ్‌లో పేర్కొన్నారు. 

మరైతే మా రక్షణ కోసం పీపీఈ కిట్లను ప్రభుత్వం సమకూర్చనుందా? అని ప్రశ్నిస్తే.. అలాంటిదేం లేదనే సమాధానం వచ్చింది. మాకు ఒకలాంటి గందరగోళ, ఆందోళనకర పరిస్థితి ఇది’అని ఒక ప్రైమరీ టీచర్‌ మీడియాతో తన ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే కోసం థర్మల్‌ గన్‌, పల్స్‌ ఆక్సీ మీటర్‌, టిష్యూ పేపర్‌, శానిటైజర్లు ఇస్తే సరిపోతుందా? అని మరికొంతమంది టీచర్లు ప్రశ్నిస్తున్నారు. కోవిడ్‌ బాధితుల సర్వే చేయిస్తున్న ప్రభుత్వం టీచర్ల సేఫ్టీని మరిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: మాస్కు ధరించకుంటే రూ.2 వేలు ఫైన్‌!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు