స్వలింగ వివాహాలపై మీ వైఖరేంటి?

15 Oct, 2020 02:03 IST|Sakshi

కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ప్రత్యేక, విదేశీ చట్టాలపై రెండు పిటిషన్లు

న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలపై తమ స్పందనను తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రంతోపాటు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక వివాహ చట్టం కింద తమ వివాహం చేసుకునేందుకు అనుమతించాలని ఒక జంట, అమెరికాలో జరిగిన తమ పెళ్లిని విదేశీ వివాహ చట్టం కింద భారత్‌లో నమోదు చేయాలని ఇంకో జంట వేర్వేరుగా వేసిన పిటిషన్లపై జస్టిస్‌ ఆర్‌.ఎస్‌. ఎండ్‌లా, జస్టిస్‌ ఆషా మీనన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకుంటామని ప్రతిపాదించిన మహిళలు ఇద్దరు ఆ చట్టంలో స్వలింగ వివాహాలకు తగిన నిబంధనలు లేకపోవడాన్ని సవాలు చేశారు. మరోవైపు అమెరికాలో వివాహం చేసుకుని రాగా విదేశీ వివాహ చట్టం కింద తమ వివాహాన్ని నమోదు చేయకపోవడాన్ని  ఇద్దరు పురుషులు సవాలు చేశారు. కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి వాయిదా పడింది. అయితే వివాహం చట్టాలు స్వలింగ వివాహాలకు అనుమతి ఇవ్వవని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ప్రత్యేక, విదేశీ వివాహ చట్టాలు రెండింటిలోనూ వివాహానికి నిర్వచనం లేకున్నా సంప్రదాయక చట్టాల ప్రకారం దాన్ని అర్థం చేసుకుంటారని వివరించింది. దీన్ని పిటిషన్‌దారులు సవాలు చేయాలని భావిసే,్త ఇప్పుడే చేయాలని స్పష్టం చేసింది. అయితే.. పిటిషన్‌దారులు సంప్రదాయ, మత చట్టాల కింద గుర్తింపు కావాలని కోరడం లేదని, కులాంతర, మతాంతర వివాహాలను గుర్తించే పౌర చట్టాల (ప్రత్యేక, విదేశీ వివాహ చట్టాలు) కింద మాత్రమే గుర్తింపు కోరుతున్నారని పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది మేనక గురుస్వామి వాదించారు.

ఇదే తొలిసారి..
ఐదు వేల ఏళ్ల సనాతన ధర్మ సంప్రదాయంలో ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇదే తొలిసారి అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన రాజ్‌కుమార్‌ యాదవ్‌ బెంచ్‌కు నివేదించారు. ఇందుకు బెంచ్‌ బదులిస్తూ... చట్టాల్లోని భాష ఏ ఒక్కరివైపో (పురుషులు, మహిళలు) సూచించడం లేదని, దేశ పౌరులందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని అర్థం చేసుకోవాలని చెప్పింది. పిటిషన్లు రెండూ ప్రకృతికి విరుద్ధమైనవి కావని అనగా కేంద్రం తరఫు మరో న్యాయవాది కీర్తిమాన్‌ సింగ్‌ అంగీకరించారు.

తాము ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్నామని, కష్టసుఖాలన్నింటినీ పంచుకుంటున్నామని.. కానీ ఇద్దరూ మహిళలమే (ఒకరి వయసు 47, ఇంకొరిది 36) అయినందున పెళ్లి మాత్రం చేసుకోలేకపోతున్నామని పిటిషన్‌దారులైన ఇద్దరు మహిళలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. పెళ్లి కాని కారణంగా మిగిలిన జంటల్లాగా సొంతిల్లు, బ్యాంక్‌ అకౌంట్‌ తెరవడం, కుటుంబ బీమా తదితరాలను పొందలేకపోతున్నామని వాపోయారు. ఆర్టికల్‌ 21 ద్వారా పౌరులకు సంప్రదించే హక్కు స్వలింగ దంపతులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.  


మరోవైపు అమెరికాలో జరిగిన తమ వివాహాన్ని భారత కాన్సులేట్‌ విదేశీ వివాహ చట్టం కింద నమోదు చేయలేదని, ఇతర జంటల మాదిరిగానే తమ వివాహాన్ని కూడా భారత కాన్సులేట్‌ గుర్తించి ఉండాల్సిందని పురుష పిటిషన్‌దారులు ఇద్దరూ పేర్కొన్నారు. 2017లో జరిగిన తమ వివాహాన్ని గుర్తించకపోవడం కారణంగా కోవిడ్‌–19 కాలంలో దంపతులుగా కలిసి ప్రయాణించేందుకు, తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు ప్రతిబంధకంగా మారిందన్నారు. భారత కాన్సులేట్‌ నిర్ణయం ఆర్టికల్‌ 14, 15, 19, 21లను అతిక్రమించిందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు