సెంట్రల్ విస్టా అవసరమే: ఢిల్లీ హైకోర్ట్

31 May, 2021 13:44 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అవసరమేనని ఢిల్లీ హైకోర్టు సోమవారం తేల్చి చెప్పింది. ఈ మేరకు దాఖలైన పిల్​ను హైకోర్టు కొట్టేసింది. దురుద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ అని పేర్కొంటూ.. పిటిషనర్ కు లక్ష రూపాయల జరిమానాను విధించింది. దీంతో కేంద్రానికి మరో ఊరట లభించింది. 

కరోనా ఉద్ధృతి సమయంలో సెంట్రల్‌ విస్టా నిర్మాణం అంతగా అవసరం లేదని, ఆ పనులను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌ సోహైల్‌ హష్మీ, ట్రాన్స్​లేటర్‌ అన్యా మల్హోత్రా ఢిల్లీ హైకోర్టులో సంయుక్తంగా పిల్​ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ల ద్విసభ్య ధర్మాసనం.. ఆ పిటిషన్ ను కొట్టేసింది. కరోనా బూచిని చూపించి సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా మంది కూలీలు అక్కడ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి సమయంలో పనులు ఆపేయాల్సిన పని లేదని పేర్కొంది.  ప్రాజెక్టు న్యాయబద్ధతపై ఇప్పటికే సుప్రీం కోర్టు విచారించిందని గుర్తు చేసింది. నిర్మాణ పనులకు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా అనుమతించిందని న్యాయస్థానం గుర్తుచేసింది.

అత్యవసరం కూడా..
పార్లమెంట్‌ నూతన భవన సముదాయం సెంట్రల్‌ విస్టా నిర్మాణ పనుల్ని కొవిడ్​ ఉధృతి వేళ  కొనసాగిస్తుండటంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది, అత్యవసరమైనది అని న్యాయస్థానం పేర్కొంది. నిర్మాణ పనులను ఆపేందుకు ఎలాంటి కారణం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేగాక, ఇది నిజమైన ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ఎవరి ప్రోద్బలంతోనే వేసిన పిటిషన్‌లా ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పిటిషన్‌దారులకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా సుమారు వెయ్యి కోట్లకు పైగా ఖర్చుతో పార్లమెంట్‌ నూతన భవన సముదాయం సెంట్రల్‌ విస్టా ఎవెన్యూ రీడెవలప్​మెంట్  ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక  కేంద్ర ప్రభుత్వం పెట్టిన డెడ్ లైన్ కు అనుగుణంగా నవంబర్ లోపు షాపూర్ జీ పల్లోంజీ సంస్థ.. సెంట్రల్ విస్టాను పూర్తి చేయాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు