శ్రద్ధా వాకర్‌ హత్య కేసు: సీబీఐ అవసరం ఏంటి?.. పేరెంట్స్‌కి లేని అభ్యంతరాలు మీకెందుకు?

22 Nov, 2022 15:04 IST|Sakshi

ఢిల్లీ: సంచలన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో ఇవాళ కూడా కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి. నిందితుడు అఫ్తాబ్‌ కస్టడీని పొడగించింది ఢిల్లీ సాకేత్‌ కోర్టు. అయితే.. సీబీఐకి అప్పగించాలన్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు డిస్మిస్‌ చేసింది. 

ఈ అభ్యర్థనను విచారణకు స్వీకరించడానికి మాకు ఒక్క మంచి కారణం కనిపించలేదు అని ఈ సందర్భంగా జస్టిస్‌ సతీష్‌ చంద్ర, జస్టిస్‌ సుబ్రమణియమ్‌ ప్రసాద్‌తో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది.  ఢిల్లీ పోలీసుల దర్యాప్తుపై బాధితురాలి తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. అలాంటిది మీకు ఎందుకు అంత ఆసక్తి?. అంటూ కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ‘మేమేం విచారణ పర్యవేక్షణ సంస్థ కాదు’ అంటూ ఘాటు కామెంట్‌ చేసింది. 

శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. అసలు సీబీఐ దర్యాప్తు కోరాల్సిన అవసరం ఏముందని పిటిషనర్‌ని నిలదీసింది. పోలీసులు 80 శాతం దాకా దర్యాప్తు పూర్తి చేశారని, ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 200 మంది సిబ్బంది ఇందులో భాగం అయ్యారని ఈ సందర్భంగా హైకోర్టు పిటిషనర్‌ తరపు న్యాయవాదికి తెలిపింది.

ఇదిలా ఉంటే ఈ కేసులో ఢిల్లీ పోలీసుల తీరును తప్పుబడుతూ.. సీబీఐకి కేసును అప్పగించాలని పిటిషనర్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. శ్రద్ధా వాకర్‌ కేసులో దర్యాప్తు సమర్థవంతంగా జరగడం లేదని, పైగా ఆధారాల సేకరణలోనూ ఢిల్లీ పోలీసులు విఫలం అవుతున్నారని, ఇవీగాక.. దర్యాప్తులో ప్రతీ విషయం మీడియాకు చేరుతోందని పిటిషనర్‌ తరపు న్యాయవాది అడ్వొకేట్‌ జోగిందర్‌ తులీ(రిటైర్డ్‌ ఐపీఎస్‌ కూడా)వాదించారు. అయితే.. కోర్టు మాత్రం సీబీఐ విచారణకు ఆదేశించేది లేదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

మరిన్ని వార్తలు