ఐటీ నిర్ణయంపై సవాల్‌.. సోనియా కుటుంబానికి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ

26 May, 2023 11:09 IST|Sakshi

ఢిల్లీ: సోనియా గాంధీ కుటుంబానికి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమ పన్ను మదింపులను సెంట్రల్ సర్కిల్‌కు బదిలీ చేయాలన్న ఐటీ అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే.. ఆ పిటిషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. 

ఐటీ శాఖ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర స్వచ్ఛంద ట్రస్టులు ఢిల్లీ హైకోర్టులోపిటిషన్‌ దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ మన్మోహన్‌, జస్టిస్ దినేష్ కుమార్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్.. ఇవాళ ఆ పిటిషన్లను కొట్టేశాయి.  

ఐటీ తీసుకున్న బదిలీ నిర్ణయం చట్టానికి లోబడి జరిగిందని తాము గుర్తించినట్లు బెంచ్‌ ఈ సందర్బంగా పేర్కొంది. ‘‘సమన్వయంతో కూడిన దర్యాప్తు కోసమే ఐటీ శాఖ ఈ బదిలీ నిర్ణయం తీసుకుంది. అందుకే ఐటీ అధికారులు జారీ చేసిన ఆదేశాలను సమర్థిస్తున్నాం. న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉన్నందున ఇందులో జోక్యం చేసుకోదల్చుకోలేదు. మెరిట్‌ ఆధారంగా ఈ వ్యవహారాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించలేద’’ని బెంచ్‌ స్పష్టం చేసింది.

అయితే.. తాము పిటిషన్లు కొట్టేసినప్పటికీ.. తగిన చట్టబద్ధమైన అధికారం వ్యవస్థ ముందు తమ వాదనలు వినిపించే స్వేచ్ఛ పిటిషనర్లకు ఉంటుందని మాత్రం బెంచ్‌ సూచించింది. 

ఇదీ చదవండి: పార్లమెంట్‌ ప్రారంభోత్సవంపై పిల్‌

మరిన్ని వార్తలు