Covaxin: పిల్లలపై ప్రయోగం.. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

19 May, 2021 19:08 IST|Sakshi

డీసీజీఐ ఉత్తర్వులపై స్టే కోరుతూ పిల్‌ దాఖలు

స్టేకు నిరాకరణ.. కేంద్రానికి నోటీసులు

న్యూఢిల్లీ: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దెబ్బకు దేశం అతలాకుతలం అయ్యింది. రానున్న రోజుల్లో థర్డ్‌ వేవ్‌ రానుందని.. దాని వల్ల పిల్లలకే ఎక్కువ ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ ఇవ్వాలనే డిమాండ్‌ పెరుగుతుండటంతో డీసీజీఐ కోవాగ్జిన్‌ 2-18 ఏళ్ల వారిపై క్లినకల్‌ ట్రయల్స్‌కి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీసీజీఐ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలయ్యింది. బుధవారం ఈ పిల్‌ విచారణ సందర్భంగా కోర్టు డీసీజీఐ ఇచ్చిన అనుమతిపై స్టే విధించేందుకు నిరాకరించింది. కేంద్రం, డీసీజీఐలకు నోటీసులు జారీ చేసింది. 

డీసీజీఐ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సంజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి పిల్‌ దాఖలు చేశారు. దీనిలో ట్రయల్స్‌లో పాల్గొంటున్న పిల్లలు తమకు తామే రిజిస్టర్‌ చేసుకుంటున్నారని తెలిపారు. అయితే వారికి టీకా ప్రయోగాల వల్ల తలెత్తే పరిణామాలపై పూర్తి స్థాయి అవగాహన ఉండదని.. కనుక ఉత్తర్వులపై స్టే విధించాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో కోర్టు స్టే ఇవ్వడం కుదరదని.. దీనిపై కేంద్రం, భారత్‌ బయోటెక్‌ల వైఖరి ఏంటో జూలై 15లోగా తెలపాలని చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం ఆదేశించింది. 

2 నుంచి 18ఏళ్ల వారిపై కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్ జరిపేందుకు అనుమతి కోరుతూ భారత్‌ బయోటెక్‌ ఈ ఏడాది ప్రారంభంలో దరఖాస్తు చేసుకుంది. అనుమతుల విషయంలో కేంద్ర ఔషధ ప్రమాణ స్థాయి సంస్థ(సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. మరి కొద్ది రోజుల్లో ఇవి ప్రారంభం కానున్నాయి. 525 మంది వలంటీర్లపై టీకాను ప్రయోగించనున్నారు. 

చదవండి: పిల్లలపై వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదం

మరిన్ని వార్తలు